వృద్ధుల జీవితాలతో ఆటలా?
♦ అర్హులకు పింఛన్లు ఇవ్వలేనప్పుడు సంక్షేమ పథకాలెందుకు?
♦ పెన్షన్లు ఇవ్వనప్పుడు వాటిని రద్దు చేయండి
♦ బతికున్న వారిని చనిపోయినట్లు చూపడంలో ఉద్దేశమేమిటి?
♦ పింఛన్ల మంజూరులో ఏపీ సర్కార్ తీరుపై హైకోర్టు ఆగ్రహం
♦ పిటిషనర్లకు వెంటనే పింఛన్లు చెల్లించాలని ఆదేశం
♦ మే 1కల్లా బకాయిలు కూడా చెల్లించాలని స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: అర్హులకు పింఛన్లు మంజూరు విషయంలో ఏపీ సర్కారు తీరుపై హైకోర్టు మరోసారి మండిపడింది. అర్హులకు పింఛన్లు మంజూరు చేయలేనప్పుడు సంక్షేమ పథకాలను ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించింది. పింఛన్లు ఇవ్వనప్పుడు వాటిని రద్దు చేయాలని ఘాటుగా వ్యాఖ్యానించింది. వృద్ధుల జీవితాలతో ఆటలాడుకోవద్దని హితవు పలికింది. చేసే ప్రతీ పని పారదర్శకంగా ఉండాలని, ప్రభుత్వాలనుంచి న్యాయస్థానాలు ఇవే ఆశిస్తున్నాయంది. పింఛన్లకింద ఇస్తున్న డబ్బు ప్రైవేటుదికాదని, అది ప్రభుత్వ డబ్బని, మరి ఈ విషయంలో ఎందుకు వివక్ష చూపుతున్నారని నిలదీసింది. బతికున్న వారిని చనిపోయినట్లు చూపి వారికి పింఛన్లు రద్దు చేయడంలో ఉద్దేశం ఏమిటంది. పిటిషనర్లకు రద్దు చేసిన పింఛన్‌ను పునరుద్ధరించి, వెంటనే వారికి చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
అంతేగాక మే 1వ తేదీకల్లా వారికి బకాయిలను కూడా చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. బతికున్న తమను చనిపోయామని చెబుతూ.. జన్మభూమి కమిటీ తమ పింఛన్లను రద్దు చేసిందని, బతికున్నట్లు ఆధారాలు చూపినా పట్టించుకోవట్లేదని, ఇదేరీతిలో వివిధ కేటగిరీల కింద అర్హతున్నా పింఛన్ రద్దు చేశారంటూ శ్రీకాకుళం జిల్లా రాపాక, కనిమెట్ట గ్రామాలకు చెందిన అమ్మణ్ణమ్మ, మరో 75 మంది హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయడం తెలిసిందే. వీటిని న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి శుక్రవారం విచారించారు.
జన్మభూమి కమిటీ చెప్పినట్టుగా అధికారులు వ్యవహరిస్తున్నారు..
పిటిషనర్ల తరఫున యర్రంరెడ్డి నాగిరెడ్డి వాదనలు వినిపిస్తూ.. జన్మభూమి కమిటీ ఎలా చెబితే ఎంపీడీఓ అలా వ్యవహరిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. లోకాయుక్త ఆదేశాలూ పట్టించుకోలేదన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. బతికున్నవారిని చనిపోయినట్లు చూపడంలో ఉద్దేశమేమిటని ఆంధ్ర ప్రాంత ఎంపీపీ, జెడ్పీపీ, గ్రామపంచాయతీల తరఫు న్యాయవాది చీమలపాటి రవిని ప్రశ్నించారు. ఈ సమయంలో అధికారుల చర్యల్ని సమర్థించేలా రవి చెప్పబోగా.. ఈ వ్యవహారంలో అధికారులకు క్లీన్‌చిట్ ఇవ్వొద్దని న్యాయమూర్తి స్పష్టం చేశారు.వారికి వెంటనే పింఛన్‌ను, బకాయిలతో చెల్లించాలని ఆదేశించారు. తదుపరి విచారణను వాయిదా వేశారు.
జన్మభూమి కమిటీల ఏర్పాటును ఎలా సమర్థించుకుంటారు?
పింఛన్ మంజూరు నిమిత్తం ప్రభుత్వం ఏర్పాటు చేసిన జన్మభూమి కమిటీల్లో ప్రజలతో ఎన్నికైన ప్రజాప్రతినిధులకు నామమాత్రపు స్థానం కల్పించడాన్ని న్యాయమూర్తి జస్టిస్ నాగార్జునరెడ్డి ప్రశ్నించారు. తద్వారా పింఛన్ల మం జూరులో వారి మాటకు విలువ లేకుండా చేశారన్నారు. ఇలా చేయడం రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విఘాతం కలిగించడమేనని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో జన్మభూమి కమిటీల ఏర్పాటును ఏవిధంగా సమర్థించుకుంటారో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలుకు ఆదేశించారు. పింఛన్లు, గృహరుణాలు, రేషన్ కార్డులకు సంబంధించిన జాబితాల్లో అనర్హులకు స్థానం కల్పిస్తూ, అర్హులకు దక్కకుండా చేస్తున్నారంటూ ప్రకాశం జిల్లాకు చెందిన బుసిరెడ్డి నాగేశ్వర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ నాగార్జునరెడ్డి శుక్రవారం విచారించారు.