= ఆగివున్న లారీని ఢీకొన్న బస్సు
= మరో ఘటనలో రెండు బస్సులు ఢీ
= 22 మందికి గాయాలు
= గాంధీలో చికిత్స
అల్వాల్,బొల్లారం, గాంధీఆస్పత్రి,న్యూస్‌లైన్: ఆర్టీసీ బస్సులో ప్రయాణం.. సురక్షితం,సుఖవం తం అన్న నినాదం..క్రమంగా కోల్పోతోంది. అదుపు తప్పుతున్న డ్రైవర్లు తరచూ ప్రమాదాలు చేస్తూ ప్రయాణికులను ఆస్పత్రుల పాల్జేస్తున్నారు. గురువారం నగరంలో వేర్వేరు చోట్ల జరిగిన ప్రమాదాల్లో సుమారు 32 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఆగివున్న లారీని ఒక బస్సు ఢీకొట్టగా..మరో ఘటనలో రెండు బస్సులు ఢీకొన్నాయి. వివరాలిలా ఉన్నాయి.. జగిత్యాల నుంచి నగరానికి వస్తున్న ఆర్టీసీ బస్సు (ఏపి29 జెడ్ 271) గురువారం మధ్యాహ్నం హకీంపేట డిపో సమీపంలో ఆగివున్న లారీని ఢీకొట్టింది.
దీంతో బస్సులో ఉన్న 22మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన బస్సుడ్రైవర్ ధనుంజయ్‌కు కాలు విరగడంతో ఆయనకు శస్త్రచికిత్స చేశారు. మొత్తం 26మంది క్షతగాత్రులు రాగా వారిలో కొంతమందికి ప్రాథమిక చికిత్స చేసి వెంటనే డిశ్చార్జీ చేశారు. ఆర్టీసీ అధికారులు ఆస్పత్రికి చేరుకొని ప్రమాదానికి కారణాలను ఆరాతీశారు. కాగా ప్రమాదానికి డ్రైవర్ ధనుంజయ్ నిర్లక్ష్యమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడా..సెల్ మాట్లాడుతున్నాడా అన్న దానిపై విచారిస్తున్నారు.
క్షతగాత్రులు వీరే : కవిత, కొమరయ్య, లక్ష్మయ్య,మణెమ్మ, నరసమ్మ, నర్సింహ, నర్సింహరెడ్డి, పుష్ప, రాజవ్వ, రాజేందర్, రమణారెడ్డి, రాములు, రావుల కొమరయ్య, సాయిరవి, సావిత్రి, ఎస్‌కేరావు (కండక్టర్). ధనుంజయ (డ్రైవర్), వెంకటయ్య, యాదగిరి, దినేష్.
మరో ఘటనలో రెండు బస్సులు ఢీ..
రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్న ఘటన బొల్లారం పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. హకీంపేట డిపోకు చెందిన బస్సు సికింద్రాబాద్ నుంచి రిసాలాబజార్ మీదుగా కౌకూర్ భరత్‌నగర్‌కు వెళ్తోంది. బొల్లారం చెక్‌పోస్టు వద్ద శామీర్‌పేట వైపు వెళ్తున్న జనగాం డిపో బస్సు దాన్ని ఢీకొట్టింది. దీంతో రెండు బస్సుల్లో ఉన్న పదిమందికి స్వల్పగాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే జనగాం డిపో బస్సు డ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు,108 సిబ్బంది సహకారంతో ప్రయాణికులకు ప్రాథమిక చికిత్సను అందించారు. ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో బొల్లారం పోలీసులు కేసు నమోదు చేయలేదు.
అమ్మో..ఆర్టీసీ
Published Fri, Jan 3 2014 3:38 AM | Last Updated on Mon, Aug 20 2018 3:26 PM
Advertisement
Advertisement