
వేధిస్తున్నాడని చంపేసింది!
భర్తను హత్య చేసి.. పోలీసులకు లొంగిపోయిన భార్య
నల్లకుంట: అనుమానంతో నిత్యం వేధిస్తున్న భర్తను చాకుతో పొడిచి చంపిందో భార్య. అనంతరం పోలీసుస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. నల్లకుంట సీఐ వి.యాదగిరి రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... నిజామాబాద్ జిల్లా వర్ని మండలం నాగారానికి చెందిన మాట్లా గంగాధర్(48), విజయలక్ష్మి దంపతులు జీవనోపాధి కోసం పదేళ్ల క్రితం నగరానికి వచ్చి నల్లకుంట నర్సింహ బస్తీలో అద్దెకుంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. గంగాధర్ ఏ పని చేయకుండా ఖాళీ ఉంటుం డగా.. విజయలక్ష్మి శివం రోడ్డులోని ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఆయాగా పని చేస్తోంది. భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని గంగాధర్ అనుమానం పెంచుకున్నాడు. నిత్యం తాగి వచ్చి ఆమెను మానసిక, శారీరక వేధింపులకు గురి చేసేవాడు. శుక్రవారం రాత్రి 10 గంటలకు పీకలదాక మద్యం తాగి ఇంటికి చేరుకున్న గంగాధర్ భార్యతో గొడవపడ్డాడు. నిత్యం తనను వేధించుకుతింటున్న భర్తను ఎలాగైనా కడతేర్చాలని విజయలక్ష్మి నిర్ణయించుకుంది. రాత్రి కుటుంబ సభ్యులంతా భోజనం చేసిన తర్వాత విజయలక్ష్మి తల్లి నాగమ్మ, చిన్న కుమార్తె పక్క గదిలో పడుకోగా, భార్యాభర్తలు మరో గదిలో పడుకున్నారు. ముందే వేసుకున్న పథకం ప్రకారం విజయలక్ష్మి శనివారం తెల్లవారుజామున 3 గంటలకు గాఢ నిద్రలో ఉన్న భర్త కడుపులో చాకుతో నాలుగు పోట్లు బలంగా పొడిచింది.
కడుపు బాగా చీరుకు పోవడంతో పేగులు బయటకు వచ్చి గంగాధర్ అక్కడికక్కడే మరణించాడు. ఉదయం వరకూ శవంతో పాటు ఇంట్లోనే ఉన్న నిందితురాలు విజయలక్ష్మి ఉదయం 6.15 గంటలకు నేరుగా నల్లకుంట పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. ఇన్‌స్పెక్టర్ యాదగిరిరెడ్డి ఘటనా స్థలానికి వెళ్లి హత్య జరిగిన తీరును పరిశీలించారు. క్లూస్‌టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. నిందితురాలిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోస్టుమార్టం అనంతరం గంగాధర్ మృతదేహాన్ని అతడి పెద్దకుమార్తెకు అప్పగించారు.
విధిలేని పరిస్థితుల్లోనే హత్య: నిందితురాలు
అనుమానంతో తనను భర్త నిత్యం వేధిస్తుండటంతో విధిలేని పరిస్థితుల్లో హత్య చేశానని నిందితురాలు విజయలక్ష్మి తెలిపింది. మద్యానికి బానిసై వచ్చిన డబ్బు మొత్తం ఖర్చు చేసేవాడని, దీంతో ఇల్లు గడవడం కష్టంగా మారడంతో తాను ఓ కళాశాలలో ఆయాగా చేరానని చెప్పింది. అయితే, వివాహేతర సంబంధం పెట్టుకున్నానని భావించి నిత్యం మానసిక వేధింపులకు గురి చేసేవాడని, జీహెచ్‌ఎసీలో పని చేసి పదవీ విరమణ పొందిన తన తల్లికి వచ్చే పెన్షన్ డబ్బు కూడా తీసుకొని తాగేవాడని తెలిపింది. నన్ను చంపి జైలుకెళ్తానని ఒకసారి హెచ్చరించాడని, అంతేకాకుండా పెద్ద చాకు కొని తెచ్చి ఇంట్లో దాచాడని విజయలక్ష్మి చెప్పింది. ఎప్పటికైనా తనను చంపేస్తాడనే భయంతోనే శనివారం తెల్లవారుజామున తానే భర్తను పొడిచి చంపానని ఆమె పేర్కొంది.