
మరింత వేగంగా ‘పల్లె ప్రగతి’
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ బ్యాంక్ నిధులతో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్తామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణ పల్లెలను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దేలా నిర్దిష్టమైన కార్యచరణతో ప్రభుత్వం ముందుకెళ్తోందని చెప్పారు. తెలంగాణ పల్లె ప్రగతి కార్యక్రమ పురోగతిపై చర్చించేందుకు ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో గురువారం ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ లక్ష్యంగా కార్యక్రమాలు రూపొందిస్తున్నామని చెప్పారు.
పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులకు ప్రపంచ బ్యాంక్ నుంచి తగినన్ని నిధులు సకాలంలో అందించాలని కోరారు. పల్లె ప్రగతితో పాటు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఇతర గ్రామీణాభివృద్ధి పథకాల అమలు పట్ల ప్రపంచ బ్యాంక్ సౌత్ ఇండియా హెడ్ శోభా శెట్టి సంతృప్తి వ్యక్తం చేశారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సహకారం అందిస్తామని తెలిపారు. సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ స్పెషల్ సీఎస్ ఎస్పీ సింగ్, డెరైక్టర్ నీతూకుమారి ప్రసాద్, ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు సీతారామచంద్ర, వినయ్ కుమార్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.