
ఫిరాయింపు మంత్రులను తొలగించండి
- లేదా ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేయించండి
- గవర్నర్‌కు జగన్ వినతిపత్రం
సాక్షి, హైదరాబాద్: తమ పార్టీ నుంచి ఫిరాయించి ఏపీ ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారిని ఆ పదవుల నుంచి తొలగించాలని లేదా వారి చేత ఎమ్మె ల్యే పదవులకు రాజీనామాలు చేయించాలని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన సోమవారం గవర్నర్‌ను కలిసి ఈ మేరకు ఒక వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ అప్రజాస్వామ్యిక చర్యను ఇలాగే వదలి వేస్తే భారత ప్రజాస్వామ్యంలోనూ, రాజ్యాంగంలోనూ ఒక చెడు సంప్రదాయంగా మిగిలి పోతుందని ఆయన అన్నారు. వినతిపత్రం వివరాలిలా ఉన్నాయి....
గౌరవనీయులు
ఈఎస్‌ఎల్ నరసింహన్ గారికి,
ఏపీ గవర్నర్, హైదరాబాద్
అయ్యా,
ఈ నెల 2వ తేదీన జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీఫారమ్‌పై ఎమ్మెల్యేలుగా ఎన్నికైన ఎన్.అమరనాథ్‌రెడ్డి, సి.ఆదినారాయణరెడ్డి, రావు సుజయ్‌కృష్ణ రంగారావు, భూమా అఖిలప్రియ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన విషయం మీకు విదితమే. ఈ నలుగురూ మరో 17 మంది ఎమ్మెల్యేలతో కలిసి ఏడాది క్రితం మా పార్టీ నుంచి టీడీపీలోకి ఫిరాయించారన్న విషయం ఇక్కడ ప్రస్తావించాల్సి రావడం దురదృష్టకరం.
పార్టీ ఫిరాయించిన ఈ ఎమ్మెల్యేలను భారత రాజ్యాంగంలోని 10వ షెడ్యూలును అనుసరించి అనర్హులుగా చేయాలని కోరుతూ ఏపీ శాసనసభ స్పీకర్‌కు మేం ఏడాది క్రితమే ఫిర్యాదులు కూడా చేశాము. అంతే కాదు, ఈ విషయమై చర్యలు తీసుకోవాల్సిందిగా పదే పదే స్పీకర్‌కు మేం గుర్తు చేసినప్పటికీ ఆయన ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. అనర్హతకు గురి కావాల్సిన ఈ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయడం అనేది చాలా దురదృష్టకరం. ఈ చర్య ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని పరిహసించడమే తప్ప మరొకటి కాదని మనవి చేస్తున్నాను.
ఇటీవల ముగిసిన ఏపీ బడ్జెట్ శాసనసభ సమావేశాల చివరి రోజున సభను వాయిదా వేసేటపుడు అసెంబ్లీలోని ఆయా రాజకీయ పార్టీల బలాబలాలను స్పీకర్ ప్రకటిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యుల బలం 66 మంది ఎమ్మెల్యేలు అని స్పష్టంగా వెల్లడించారు. అంతే కాదు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ వెబ్‌సైట్‌లో కూడా 2017, మార్చి 31వ తేదీన ఇదే విషయాన్ని పొందు పర్చారని మీ దృష్టికి తెస్తున్నాను. మన ప్రజాస్వామ్య విలువల ఔన్నత్యాన్ని కాపాడేందుకుగాను భారత రాజ్యాంగం ప్రకారం మీకు (గవర్నర్‌కు)సంక్రమించిన విచక్షణాధికా రాలను ఉపయోగించి, ఈ పరిస్థితులను చక్కదిద్దేందుకు, ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలను మంత్రి పదవుల నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక వేళ అలా కాకుండా వారు మంత్రులుగా కొనసాగాలంటే ముందు వారిచేత తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయించాలని, ఆ రాజీనామాలు ఆమోదం పొందేలా మీరు పట్టుబట్టాలని కోరుతున్నాను. ఈ అంశంపై చర్య తీసుకోక పోతే భారత ప్రజాస్వామ్యం, రాజ్యాంగ చరిత్ర పుటల్లో ఒక చెడు సంప్రదాయంగా నిలిచిపోతుంది. అంతే కాదు, భారత ప్రజాస్వామ్య మనుగడకు భవిష్యత్తులో తీవ్ర విఘాతం కలుగుతుంది. అందుకే న్యాయాన్ని కాపాడేందుకు గాను ఈ మంత్రులను మంత్రివర్గం నుంచి తొలగించడం గాని, లేదా వారి చేత ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేయించడం గాని చేసి సవరణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
ఇట్లు...
భవదీయుడు
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి