
అప్పగింతలపై సయోధ్య!
- నేడు గవర్నర్ సమక్షంలో రెండు రాష్ట్రాల కమిటీల భేటీ
- సెక్రెటేరియట్ తెలంగాణకు.. లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ఏపీకి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని ప్రభుత్వ కార్యాలయాలు, భవనాల అప్పగింతలపై బుధవారం రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ఆధ్వర్యంలో కీలక సమావేశం జరగనుంది. దీనిపై రాజ్‌భవన్ కార్యాలయం రెండు రాష్ట్రాలకు లేఖలు రాసింది. విభజన చట్టం పరిధిలో ఉన్న ప్రభుత్వ కార్యాలయా లు, నివాస భవనాల అంశంపైనే చర్చించను న్నట్లు ప్రస్తావించింది. రెండు రాష్ట్రాలు ఇప్ప టికే ఏర్పాటు చేసుకున్న కమిటీ ప్రతినిధుల తోపాటు సభ్య కార్యదర్శులను (మెంబర్ సెక్రెటరీ) సమావేశానికి పంపించాలని ఆహ్వా నించింది.
భవనాల అప్పగింతకు ఏపీతో సం ప్రదింపులకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వివేక్‌తో కమిటీని ఏర్పాటు చేసింది. వీరితోపాటు సాధారణ పరిపాలన శాఖ (రాష్ట్ర పునర్విభజన) ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును మెంబర్ సెక్రెటరీగా నియమించినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పీ సింగ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ ప్రభుత్వం తరఫున కమిటీ ప్రతినిధులు యనమల, అచ్చెన్నాయుడు, కాల్వ శ్రీనివాసులుతో పాటు అక్కడి మెంబర్ సెక్రెటరీ ప్రేమ్‌చంద్ రెడ్డి సమావేశానికి హాజరవుతారు.
సయోధ్య కుదిరిందా!
భవనాల అప్పగింతపై తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు ఇప్పటికే పరస్పర అంగీకారానికి వచ్చినట్లు సమాచారం. తమకు కేటాయిం చిన అసెంబ్లీ, కౌన్సిల్, సెక్రెటేరియట్ భవనాలను తిరిగి అప్పగించేందుకు ఏపీ ప్రభుత్వం సానుకూలతను వ్యక్తం చేసింది. ప్రత్యామ్నాయంగా తమకు రాజ్‌భవన్ రోడ్‌లోని లేక్ వ్యూ గెస్ట్‌హౌస్‌ను స్వాధీనం చేయాలనే ప్రతిపాదన లేవనెత్తింది. అందుకు తెలంగాణ ప్రభుత్వం కూడా సమ్మతించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం లేక్‌వ్యూ గెస్ట్ హౌస్ ఏపీ ఆధీనంలోనే ఉంది. హైదరాబాద్‌లో ఏపీ సీఎం చంద్రబాబు క్యాంపు కార్యాలయం పేరుతో కొనసాగుతోంది. అందుకే ఈ భవనాన్ని ఏపీకి ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం పెద్దగా అభ్యంతరం చెప్పటం లేదు.