ఒకటో నంబర్ క్రిమినల్ | YSRCP Extends Complete Support to Kapu Reservations: YS Jagan Mohan Reddy | Sakshi
Sakshi News home page

ఒకటో నంబర్ క్రిమినల్

Published Tue, Feb 2 2016 2:21 AM | Last Updated on Mon, Jul 30 2018 6:21 PM

ఒకటో నంబర్ క్రిమినల్ - Sakshi

ఒకటో నంబర్ క్రిమినల్

చంద్రబాబుపై వైఎస్ జగన్ మండిపాటు

* రంగాను హత్య చేయించింది నువ్వే కదా
* నీ చుట్టూ ఉన్నది క్రిమినల్సే
* కాపుల రిజర్వేషన్‌పై మాటమార్చావు
* హామీలిచ్చి అన్ని వర్గాలనూ మోసగించావు
* మేనిఫెస్టోలో చెప్పినవి ఏం అమలు చేశావు?
* అన్ని వర్గాల మధ్య చిచ్చుపెట్టడమే నీ నైజం
* ప్రశ్నిస్తున్నవారిపై అభాండాలు వేస్తావు
* కాపుల డిమాండ్లకు సంపూర్ణ మద్దతు
* బీసీలకు ఇబ్బంది లేకుండానే కాపులకు రిజర్వేషన్ ఇవ్వొచ్చు
* తమిళనాడు తరహాలో కేంద్రంపై ఒత్తిడి తేవాలి
* రాజ్యాంగ సవరణే కాపు రిజర్వేషన్‌కు మార్గం

 
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి:
 ‘‘చంద్రబాబూ నువ్వే క్రిమినల్ నంబర్ వన్‌వి. కాపులను బీసీల్లో చేర్చుతానని చెప్పి మాట మార్చావు. ఎన్నో హామీలిచ్చి అందరినీ మోసం చేశావు. పార్టీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చి మాట తప్పావు. కులాలు, వర్గాలు, మతాలు, ప్రాంతాల మధ్య  చివరకు మనుషుల మధ్య కూడా చిచ్చు పెడుతున్నావు. కాపు నాయకుడు వంగవీటి మోహనరంగాను హత్య చేయించావు. ఇవాళ కాపుల సభ జరగనీయకుండా ప్రయత్నాలు చేసి చివరకు హింస ప్రజ్వరిల్లేలా పథకం పన్నావు. అందుకని నువ్వే క్రిమినల్ నంబర్ వన్..’’ అని ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బాబు నోరు తెరిస్తే అబద్ధాలేనని, తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఆయన ఏ స్థాయికైనా దిగజారతారని జగన్ విమర్శించారు.

తన అవినీతిని, తప్పులను, మోసాలను ప్రశ్నించే వారిపై ఎలాంటి అభాండాలు వేయడానికైనా వెనకాడడని ఎద్దేవా చేశారు. కాపులు చేస్తున్నది న్యాయమైన పోరాటమని, వారి డిమాండ్లన్నిటికీ తాము మద్దతిస్తున్నామని స్పష్టంచేశారు. బీసీలకు ఇబ్బంది కలగకుండానే కాపులకు రిజర్వేషన్ సదుపాయం కల్పించవచ్చని అందుకు అవసరమైన చర్యలన్నీ తీసుకోవాలని జగన్ డిమాండ్ చేశారు. తమిళనాడు తరహాలో మనమూ కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి రాజ్యాంగ సవరణ చేయించి కాపుల రిజర్వేషన్ అంశానికి ఒక మంచి ముగింపు ఇవ్వాలని సూచించారు. పార్టీ నాయకులు బొత్స సత్యనారాయణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అంబటి రాంబాబులతో కలసి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. వివరాలు ఆయన మాటల్లోనే..

 చంద్రబాబు ఏ స్థాయికైనా దిగజారగలడు..
 చంద్రబాబు నిన్న చాలా సుదీర్ఘంగా ఆత్మస్థుతి, పరనింద పద్ధతిలో ప్రసంగించారు. ఒక ముఖ్యమంత్రి ఇంత చీప్‌గా మాట్లాడడమనేది బహుశా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో     ఎన్నడూ లేదు. రాజకీయాల కోసం తాను తప్పులు చేస్తూ అవి ఇతరుల మీద నెట్టడానికి ఆయన ఏ స్థాయికైనా దిగజారగలడు. ఆయన రకరకాల ఆరోపణలు చేశాడు. కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య వైఎస్సార్‌సీపీ చిచ్చు పెడుతోందన్నాడు. తుని ఘటనలకు వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్‌లే కారణమన్నాడు. తన తప్పులు బైటపడకుండా చూసుకోవడానికి అవతలివాళ్లపై అభాండాలు వేశాడు.

 బాబే క్రిమినల్ నెంబర్ 1.. ఎందుకంటే..
 తెలుగుదేశం మేనిఫెస్టోలో కాపులకు సంబంధించి ఒక పేజీ కేటాయించారు. రిజర్వేషన్ కల్పించడం కోసం ఒక కమిషన్‌ను నియమించి నిర్ణీత కాలవ్యవధిలోనే బీసీలకు నష్టం జరక్కుండా సమస్యను పరిష్కరిస్తామని అందులో పేర్కొన్నారు. ఐదు సంవత్సరాలలో ఐదువేల కోట్లు కేటాయించి వారి సంక్షేమానికి ఖర్చుచేస్తామని చెప్పాడు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, ఆరోజు అబద్దాలు చెప్పి తర్వాత మోసం చేయడం వల్లే ప్రజల్లో అసహనం వచ్చింది. ఒక కులమో లేక మతమో కాదు అన్ని కులాల్లో, అన్ని మతాల్లో, అన్ని జిల్లాల్లో, అన్ని ప్రాంతాల్లో ఈ అసహనం ఉంది. ఎన్నికల ముందు రైతు రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తానని చెప్పలేదా? మరి మోసం చేసినందుకు నిన్ను క్రిమినల్ నెంబర్ 1 అని ఎందుకు అనకూడదు? డ్వాక్రా అక్కచెల్లెమ్మల రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తానని చెప్పలేదా? బాబొస్తేనే జాబొస్తుంది అన్నావు. ఇంటికో ఉద్యోగమన్నావు. ఉద్యోగమివ్వకపోతే ప్రతి ఇంటికీ రెండువేల నిరుద్యోగ భృతి ఇస్తానన్నావు. బీసీలకు నష్టం జరక్కుండా కాపులను బీసీల్లో చేరుస్తా అన్నావు. ఏడాదికి వెయ్యికోట్లు కేటాయిస్తానన్నావు. ఎన్నికలప్పుడు చెప్పి ఇపుడు చేయడం లేదు. నిన్ను క్రిమినల్ నెంబర్ 1 అని ఎందుకు అనకూడదు?

 నీకు మానవత్వమనేది ఉందా బాబూ?
 కాపుల మీటింగ్ జరక్కుండా చూసేందుకు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టావు. జనవరి 31న మీటింగ్ పెడతామని వాళ్లు నాలుగైదు నెలల క్రితమే చెప్పారు. మీ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలందరూ ఎవరూ ఆ మీటింగ్‌కి హాజరవకుండా అందరినీ హైదరాబాద్ రప్పించుకున్నావు. అరకొరగానే బస్సులకు అనుమతిచ్చావు. మీటింగ్ జరుగుతున్న స్థలానికి ఏడెనిమిది కిలోమీటర్ల దూరంలోనే కార్లన్నీ ఆపేశావు. వాళ్లు మీటింగ్‌కి పోకుండా ట్రాఫిక్‌లో చిక్కుకునేలా చేశావు. వాళ్లను అసహనానికి గురిచేసి వారి భావోద్వేగాలతో ఆడుకున్నావు. రకరకాలుగా ఇబ్బందులు పెట్టావు. నువ్వెంతగా ఆటంకపరిచినా ఆ మీటింగ్ విజయవంతమైంది. లక్షల మంది హాజరయ్యారు. ఆ మీటింగ్ వల్ల ఉద్యమకారులకు, ప్రతిపక్షనాయకులకు మంచిపేరొస్తుందని భయపడి వాళ్లకు చెడ్డపేరు తేవడం కోసం నువ్వే అలజడి సృష్టించావు. నిజంగా చంద్రబాబూ నీలో మానవత్వమనేది ఉందా అని అడుగుతున్నా.  ఆ మీటింగ్‌లో ఏం జరిగిందో నీకు తెలియదా? ముద్రగడ పద్మనాభం ప్రసంగించగానే తీవ్రభావోద్వేగాల మధ్య రాస్తారోకో, రైల్‌రోకోలకు ఆయన పిలుపునిచ్చాడు. ఆరు చానళ్లకే ఈ విషయం ఎలా తెలుసని అడుగుతున్నావు. ఇలా ఆరు చానళ్లు అని ఎందుకు చెబుతున్నాడంటే ఇక ఎవరూ కాపు ఉద్యమాన్ని కవర్ చేయకూడదనే పథకం.

 రంగాను హత్యచేయించిన నువ్వే క్రిమినల్
 క్రిమినల్ అని అంటున్నావు. అసలు క్రిమినల్ బుర్ర నీది కాదా?. 1988లో ఇదే మాదిరిగానే తెలుగుదేశానికి వ్యతిరేకంగా విజయవాడలో కాపునాడు సభ జరిగింది. ఆ సభ విజయవంతం కావడంతో తట్టుకోలేక వంగవీటి మోహనరంగాను హత్య చేయించావు. నీదా క్రిమినల్ బుర్ర వేరేవాళ్లదా? నువ్వే చంపించావు.. నువ్వే కుట్రదారువు అని చెప్పి ఆనాడు మీ కేబినెట్‌లో ఉన్న మంత్రి హరిరామజోగయ్య పుస్తకం కూడా రాశాడు. చంద్రబాబు నాయుడు ప్రమేయంతోనే రంగా హత్య జరిగిందని ఆయన స్పష్టంగా రాశాడు. రంగాను చంపినవాళ్లంతా ఇవాళ ఏపార్టీలో ఉన్నారు?  రంగాను చంపిన కేసులో ముద్దాయి ఇవాళ స్పీకర్ కోడెల శివప్రసాదరావు. మరొకరు దేవినేని ఉమామహేశ్వరరావు మంత్రిగా ఉన్నాడు. విజయవాడ నుంచి విశాఖ వెళ్లి అక్కడ ఎమ్మెల్యేగా ఎన్నికైన రామకృష్ణ ఇంకొకరు. చంద్రబాబు నాయుడు అసలు ముద్దాయి. ఎవరండీ క్రిమినల్స్ ? క్రిమినల్ బుద్ధి ఉన్నది చంద్రబాబుకే. ఆయన ఆలోచనలన్నీ దుర్మార్గపు ఆలోచనలు. చేసేవన్నీ ఇవే. నెపాలు మాత్రం వేరేవాళ్లపై వేస్తారు. ఇవా రాజకీయాలంటే. రాజకీయాలంటే స్ఫూర్తినిచ్చే విధంగా ఉండాలి.

 చిచ్చు రగిల్చేది నువ్వే!
 నువ్వు మేనిఫెస్టోలో పెట్టావు కాబట్టే ఇవాళ నిన్ను గట్టిగా నిలదీస్తున్నారు. కాపులకు రిజర్వేషన్ ఇవ్వాలంటే బీసీలు ఒప్పుకోవడం లేదని అంటున్నావు. బీసీలకు నష్టం జరక్కుండా కాపులకు రిజర్వేషన్ ఇస్తానని చెప్పి మేనిఫెస్టోలో పెట్టావు. బీసీలకు నష్టం జరక్కుండా చేస్తే ఎందుకు బీసీలు ఒప్పుకోరు? మీ పార్టీకి చెందిన బీసీ నాయకుడు కృష్ణయ్యతో స్టేట్‌మెంట్లు ఇప్పిస్తావు. మరి ఇదే కృష్ణయ్య ఈ మేనిఫెస్టో విడుదల చేసినపుడు మీ పార్టీలో లేడా? మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత ఆయన మీ పార్టీ తరఫున పోటీ చేయలేదా? కాపులకు బీసీలకు మధ్య చిచ్చుపెట్టే కార్యక్రమం నువ్వు చేస్తున్నావు. గతంలో ఎస్సీ వర్గీకరణ అని చెప్పి మాలలకు మాదిగలకు మధ్య చిచ్చుపెట్టావు. రాజ్యాంగ సవరణ అవసరం అన్న సంగతి నీకు తెలియదా ఆ రోజు? సమస్య నువ్వే సృష్టిస్తావు. కోర్టుకు నువ్వే పంపిస్తావు. ఇవాళ్టికీ ఎస్సీ వర్గాల మధ్య వర్గీకరణ చిచ్చు కొనసాగడానికి నువ్వే కారణం. కులాల మధ్య, మతాల మధ్య, వర్గాల మధ్య, ప్రాంతాల మధ్య, చివరకు మనుషుల మధ్య కూడా రాజకీయాల కోసం చిచ్చు పెట్టేది నువ్వే.

 కాపుల డిమాండ్లకు మా సంపూర్ణ మద్దతు
 కాపుల డిమాండ్లకు సంపూర్ణంగా మద్దతిస్తున్నాం. బీసీలకు నష్టం జరక్కుండా కాపులకు రిజర్వేషన్ ఇవ్వండి అనే ప్రతిపాదనకు గట్టిగా మద్దతిచ్చేవారిలో మా పార్టీ ముందుంటుంది. చంద్రబాబు మేనిఫెస్టోలో కూడా అదే చెప్పారు. కాపులకు సంబంధించి గత చరిత్ర ఒకసారి చూస్తే 1956 వరకు కాపులు బీసీ జాబితాలోనే ఉన్నారు. 1910 నుంచి రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొట్టమొదటగా 1953లో వేసిన ఖలేల్కర్ బీసీ కమిషన్ ప్రకారం కూడా కాపులు బీసీలుగానే ఉన్నారు. ఆ తర్వాత మూడేళ్లకే అంటే 1956లో ఒక జీవో ద్వారా తొలగించారు. ఆ అన్యాయాన్ని సరిదిద్దండి అని కాపులు చేస్తున్న డిమాండ్ సహేతుకం. చంద్రబాబుకు తెలుసు ఏం చేయాలనేది. తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లున్నాయి.

తమిళనాడు పద్ధతిలో ఇక్కడ ఎందుకు చేయలేకపోతున్నారు? 1994లో తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొనివచ్చి షెడ్యూల్ 9లో దీనిని చేర్చేలా రాజ్యాంగ సవరణ జరిగింది. నువ్వు మద్దతిస్తున్న బీజేపీ ప్రభుత్వమే కేంద్రంలో ఉంది. అసెంబ్లీలో తీర్మానం చేసి బీజేపీ ప్రభుత్వానికి పంపి షెడ్యూల్ 9లో ఈ అంశాన్ని చేర్చేలా రాజ్యాంగ సవరణ చేయించాలి. అప్పుడే 50 శాతం దాటి బీసీలకు నష్టం జరక్కుండా కాపులకు కూడా రిజర్వేషన్ ఇవ్వొచ్చు. కానీ చంద్రబాబు ఎందుకు ఆ పని చేయడం లేదు? కమిషన్ వేస్తే దానికి దశ, దిశ చెప్పాలి. మార్గదర్శకాలు ఇవ్వాలి. 1910 నుంచి 1956 వరకు ఉన్న రిజర్వేషన్ అన్యాయంగా తొలగించారు కాబట్టి ఇపుడు 50 శాతం ఆవల వీరికి ఎంత మేరకు రిజర్వేషన్ ఇవ్వాలి అనే అంశాన్ని పరిశీలించేలా మార్గదర్శకాలు ఇవ్వాలి. కమిషన్‌కు ఏం మార్గదర్శకాలు ఇవ్వాలో తెలియకుండానే చంద్రబాబు కమిషన్ వేసేశారు. రేపు ఆ కమిషన్ నివేదిక వ్యతిరేకంగా వస్తే మేమేమీ చేయలేమని చంద్రబాబు అంటారు. కాపు సామాజిక వర్గానికి ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా. మనం చేసే పోరాటం పూర్తిగా సమంజసమైనది. చంద్రబాబు మేనిఫెస్టోలో పెట్టినదే అడుగుతున్నాం. కాపులకు రిజర్వేషన్ సాధనకు కలసికట్టుగా అడుగులు వేద్దాం. ఎక్కడా విధ్వంసకర కార్యకలాపాలకు పాల్పడవద్దు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement