
భూమనను ఇరికించేందుకు కుట్ర : అంబటి
హైదరాబాద్: తుని ఘటనలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భూమన కరుణాకర్‌రెడ్డిని ఇరికించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.... అరెస్టులు, బెదిరింపులతో కాపు ఉద్యమాన్ని ఆపలేరన్నారు.
కాపులను ఆరు నెలల్లో బీసీల్లో చేరుస్తామని చెప్పిన చంద్రబాబు రెండున్నర ఏళ్లు అయినా... కమిషన్ పేరుతో కాలయాపన చేస్తున్నారన్నారు. తుని ఘటనలో భూమనకు సంబంధమేమిటన్నారు. కాపునేత ముద్రగడ పద్మనాభంను భూమన కలిసి ఉద్యమానికి మద్దతు తెలిపినంత మాత్రాన కేసులు పెడతారా.. ? అని అంబటి ప్రశ్నించారు. ఈ కేసులో ఇరికించాలనే ఆయనకు మరోసారి నోటీసులు ఇచ్చారన్నారు. ఇలాంటి బెదిరింపులకు వైఎస్సార్సీపీ నేతలు భయపడరని చెప్పారు. ముందుగా నేతలపై కేసులు పెడతారని...కేసులకు లొంగకపోతే చంద్రబాబు కాసులు ఇస్తారన్నారు. అందితే జట్టు, అందకపోతే కాళ్లు పట్టుకోవడం బాబు నైజమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తుని ఘటనకు ప్రభుత్వ వైఫల్యామే ప్రధాన కారణమని అంబటి చెప్పారు.