టీడీపీ ప్రభుత్వం ఓ ఫార్స్ : బొత్స
సాక్షి, హైదరాబాద్: జన్మభూమి ఓ మోసపూరిత కార్యక్రమమని, ఏపీ ప్రభుత్వ పనితీరు ఓ ఫార్సుగా తయారైందని వైఎస్సార్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. పార్టీ నేతలు పార్థసారథి, మర్రి రాజశేఖర్‌లతో కలసి ఆయన మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మూడో విడత జన్మభూమి కార్యక్రమం ప్రకటించినపుడు సీఎం చంద్రబాబుకు సంబంధించిన వెబ్‌సైట్ ‘కోర్ డాష్ బోర్డ్’లో మొదటి, రెండో విడత జన్మభూమి కార్యక్రమాల్లో 28 లక్షల 50 వేల పైచిలుకు పెండింగ్ దరఖాస్తులు ఉన్నట్లుగా మూడో విడత ప్రారంభించిన రోజు వరకూ చూపారని, మూడో విడత అలా ప్రారంభించారో లేదో తొలి రోజునే ఆ దరఖాస్తులన్నీ పరిష్కరించినట్లు ఆ వెబ్‌సైట్లో పేర్కొన్నారని చెప్పారు.
ఈ విషయం తెలియని కొన్ని పత్రికలు 95% దరఖాస్తులు పరిష్కా రమైనట్లు రాసేశాయన్నా రు. అంత తక్కువ సమయంలోనే ఈ దరఖాస్తులన్నీ పరిష్కారమయ్యాయా! ఇలా జిమ్మిక్కులు చేస్తారా? ఇంత మోసమా? అని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. మాయమాటలు చెబుతున్న టీడీపీ నేతలను జన్మభూమి కార్యక్రమాల్లో ప్రజలు నిలదీయాలని, గత జన్మభూమి కార్యక్రమాల్లో తీసుకున్న ద రఖాస్తులు ఏమయ్యాయో అడగాలని పిలుపునిచ్చారు. ఓవైపు టీడీపీ నేతలు, మంత్రులు, ముఖ్యమంత్రి ప్రజాధనాన్ని దోపిడీ చేస్తూ మరో వైపు పేద విద్యార్థులు రాజధాని నిర్మాణానికి విరాళాలివ్వాలంటూ ప్రభుత్వం సర్కులర్ జారీ చేయడం సిగ్గు చేటని విమర్శించారు.