'ఉగ్రవాదం, తీవ్రవాదం కన్నా ప్రమాదకరం'
'ఉగ్రవాదం, తీవ్రవాదం కన్నా ప్రమాదకరం'
Published Sat, Oct 22 2016 3:55 PM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM
► అమరావతిలో అభివృద్ధి శూన్యం
► అవినీతికే వ్యతిరేకం..అభివృద్ధికి కాదు
► వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున
హైదరాబాద్: నిరుద్యోగులకు కనీసం నిరుద్యోగ భృతి కూడా ఇవ్వలేని అసమర్ధ పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే అసలైన ఉగ్రవాది అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు మేరుగ నాగార్జున విమర్శించారు. చంద్రబాబు రెండున్నరేళ్ల పాలనలో రైతులు, వృద్ధులు, డ్వాక్రా మహిళలు, విద్యార్ధులు, నిరుద్యోగులు ఆఖరుకి ఉద్యోగులు కూడా సంతోషంగా లేరన్నారు. శనివారం కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మేరుగ మాట్లాడారు. ఎన్నికలకు ముందుకు ఇచ్చిన హామీలు ఒక్కటైనా నెరవేర్చారా అని టీడీపీ ప్రభుత్వాన్ని నిలదీశారు.
తీవ్రమైన వర్షాల కారణంగా అంటువ్యాధులు ప్రబలి గిరిజనులు అల్లాడిపోతుంటే పట్టించుకోరు కానీ బాక్సైట్ తవ్వకాలకు మాత్రం ఆ గిరిజనుల భూములను లాక్కోవడానికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. వారి హక్కుల కోసం పోరాడుతున్న వైఎస్సార్‌సీపీని ,నాయకులను ఉగ్రవాదులు, తీవ్రవాదులుగా ముద్రవేస్తున్నారని మండిపడ్డారు. జనాల మధ్య నిర్మిస్తున్న ఆక్వా పార్కు నిర్మాణానికి వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులకు తమ నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మద్దతు ప్రకటిస్తే.. అభివృద్ధిని అడ్డుకుంటున్నాడంటూ ఎల్లో మీడియా ద్వారా విషప్రచారానికి పాల్పడటం చంద్రబాబుకే చెల్లిందన్నారు.చంద్రబాబు పాలన ఉగ్రవాదం, తీవ్రవాదం కన్నా ప్రమాదకరంగా మారిందని మేరుగ ఆరోపించారు.
కిరణ్ కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సచివాలయం సాక్షిగా చంద్రబాబు చేసిన లాబీయింగ్‌లు ప్రజలందరికీ తెలుసున్నారు. ఆక్వా పార్కు మొదలైనప్పడు ముందుగా వ్యతిరేకించింది టీడీపీ ఎమ్మెల్యేనని, వారు కూడా తీవ్రవాదులేనా అని ప్రశ్నించారు. ఆక్వా పార్కును తామెప్పుడూ వద్దనలేదని కాకపోతే సముద్రానికి దగ్గర్లో నిర్మించుకోవాలని సూచించామన్నారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పడు ఆందోళనలు ఎందుకు చేశారో చెప్పాలన్నారు. మీరు చేస్తే తప్పు కాదు.. మేం చేస్తే తప్పా..? అని ఆయన సూటిగా ప్రశ్నించారు.
అవినీతికే వ్యతిరేకం..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అభివృద్ధికి వ్యతిరేకం కాదని.. అభివృద్ధి ముసుగులో అధికారం బలంతో, ధన దాహంతో టీడీపీ చేస్తున్న అవినీతిపైనే తమ పోరాటమని నాగార్జున స్పష్టం చేశారు. తండ్రీ కొడుకులు కలిసి ప్రజాధనాన్ని లూఠీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాజధాని నిర్మాణం కోసం రైతుల నుంచి సేకరించిన 33 వేల ఎకరాలతో కనీసం ఒక్క నిర్మాణమైన చేపట్టకపోగా.. ఆ భూములతో ప్లాట్ల వ్యాపారం చేయడం అన్యాయమన్నారు. రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతులకు ఇంతవరకు నష్ట పరిహారం అందలేదన్నారు. ఇళ్లు కోల్పోయిన వారికి పునరావాసం ఎక్కడ కల్పిస్తారో చెప్పకపోవడంతో వారి పరిస్థితి అయోమయంగా ఉందన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాజధాని అమరావతి నూతన వధూవరులకు పురోహితుడు చూపించే అరుంధతి నక్షత్రంలా ఉందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పాలన ఉగ్రవాదం, తీవ్రవాదం కన్నా ప్రమాదకరంగా మారిందని ఆరోపించారు.
కరువుపై కపట నాటకం..
రాయలసీమ కరువు పరిస్థితులపై చంద్రబాబు కపట నాటకమాడుతున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు కరువుపై పరస్పర విరుద్ధ ప్రకటనలు గుప్పిస్తూ.. ప్రజలను మోసం చేయడం నిజం కాదా అని ప్రశ్నించారు. రాయలసీమలోని కడప,అనంతపురం,కర్నూలు జిల్లాల్లో కరువు మండలాలను ప్రకటించడమే ఇందుకు నిదర్శనమన్నారు. అనంతపురం జిల్లాని సస్యశ్యామలం చేశామన్నారు. రెయిన్‌గన్‌లతో వ్యవసాయం చేసి కరువును తీరం దాటించామని గొప్పులు చెప్పుకున్నారని ఎద్దేవా చేశారు. ఒక ముఖ్యమంత్రి స్ధానంలో ఉన్న వ్యక్తులు ఇంత దిగజారిపోయి ప్రవర్తించడం సిగ్గుచేటన్నారు. ఫ్యాను గుర్తుపై గెలిచిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను రూ.30 కోట్ల చొప్పన సంతలో పశువుల్లా కొనుగోలు చేసిన చంద్రబాబు.. రైతులు, డ్వాక్రా రుణాల మాఫీ విషయానికొచ్చే సరికి బీద అరుపులు అరుస్తున్నారని మండిపడ్డారు. నిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతున్న వైఎస్సార్‌సీపీని, నాయకులను తీవ్రవాదులుగా చిత్రీకరించడానికి చూపుతున్న శ్రద్ధ పాలనపై పెడితే బాగుంటుందని చంద్రబాబుకు మేరుగ నాగార్జున హితవు పలికారు.
Advertisement
Advertisement