మంత్రి దేవినేని ఓ ఉన్మాది
తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన వైఎస్సార్‌సీపీ నేత పార్థసారథి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఓ మంత్రిగా కాకుండా ఉన్మాదిలా మాట్లాడుతున్నారని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి ధ్వజమెత్తారు. ఆయన సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ... పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయంపై ప్రతిపక్షంతో సహా పలువురు నేతలు లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని విమర్శించారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అంచనా వ్యయం రూ 16 వేల కోట్ల నుంచి రూ 42 వేల కోట్లకు పెరిగిందని, ఈ అదనపు మొత్తాన్ని ఎవరు భరిస్తారన్న విషయంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనికి సమాధానం చెప్పకుండా తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి, కేవీపీ పోలవరం ప్రాజెక్టును అడ్డుకుంటున్నారని మంత్రి ఎదురుదాడికి దిగుతున్నారని ఆక్షేపించారు.
పోలవరం ప్రాజెక్టుకు బద్ధ వ్యతిరేకి సీఎం చంద్రబాబేనని పార్థసారథి విమర్శించారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో పోలవరం ప్రాజెక్టును ప్రారంభించినపుడు ఒడిశా, చత్తీస్‌గఢ్‌లను రెచ్చగొట్టి కేసులు వేయించి అడ్డుకున్న ఘనత ఆయనదేనని చెప్పారు. బాపులపాడు మండలంలో టీడీపీకి చెందిన రైతులతో కేసులు వేయించింది దేవినేని ఉమామహేశ్వరరావేనని తెలిపారు.