'స్పీకర్ నిర్ణయం బాబుకు చెంపపెట్టు కావాలి' | ysrcp mla jyothula nehru takes on chandrababu naidu | Sakshi
Sakshi News home page

'స్పీకర్ నిర్ణయం బాబుకు చెంపపెట్టు కావాలి'

Published Sat, Mar 5 2016 12:21 PM | Last Updated on Mon, Jul 29 2019 2:44 PM

'స్పీకర్ నిర్ణయం బాబుకు చెంపపెట్టు కావాలి' - Sakshi

'స్పీకర్ నిర్ణయం బాబుకు చెంపపెట్టు కావాలి'

హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచి, పార్టీ ఫిరాయించిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై చర్చలు తీసుకోవాలని స్పీకర్ కోడెల శివప్రసాదరావును కోరినట్లు  వైఎస్ఆర్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రు తెలిపారు. వారిపై తక్షణమే వేటు వేయాలని స్పీకర్కు ఫిర్యాదు చేసినట్లు ఆయన చెప్పారు. స్పీకర్ను కలిసిన అనంతరం వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకర్లతో మాట్లాడారు. విధివిధానాల బట్టి నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ తెలిపారని జ్యోతుల నెహ్రు పేర్కొన్నారు.

ఎమ్మెల్యేలపై చర్యలతో ప్రజాస్వామ్యాన్ని స్పీకరే రక్షించాలని, ఆయన నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారని తాము భావిస్తున్నామన్నారు. అలా జరిగితే రాజకీయాల్లో  నీతి, నిబద్ధత అంటూ సెల్ఫ్ డబ్బా కొట్టుకునే చంద్రబాబుకు కనువిప్పు కలుగుతుందని తాము భావిస్తున్నామన్నారు. స్పీకర్ తగు నిర్ణయం తీసుకుంటే అది చంద్రబాబుకు చెంపపెట్టు అవుతుందని జ్యోతుల నెహ్రు అన్నారు.  ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తే అసెంబ్లీ సెగ్మెంట్లకు ఉప ఎన్నికలు వస్తాయన్నారు. ఉప ఎన్నికలు వస్తే ప్రజల మనోభావాలు తెలుస్తాయని ఆయన పేర్కొన్నారు.

కొందరు ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేశారని జ్యోతుల నెహ్రు వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించి (వాయిస్, వీడియో రికార్డులు, ఫోటోలు) అన్ని ఆధారాలను స్పీకర్కు అందచేశామన్నారు. వైఎస్ఆర్ సీపీకి స్పీకర్ న్యాయం చేస్తారని తాము భావిస్తున్నామన్నారు. ఈ రోజు నుంచి ప్రారంభం అయ్యే బడ్జెట్ సమావేశాల్లో సమస్యలపై దేనికి ఇచ్చే ప్రాధాన్యత దానికి ఇచ్చుకుంటూ వెళతామన్నారు. ముందుగా ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలని భావిస్తున్నట్లు చెప్పారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ తీసుకునే నిర్ణయం బట్టి ఆయనపై అవిశ్వాసం పెట్టాలా వద్దా అనే దానిపై ఆలోచిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement