ట్రంప్‌పై టెక్ వార్.. మాజీ కార్యదర్శుల మద్దతు
వాషింగ్టన్: ట్రావెల్ బ్యాన్‌కు వ్యతిరేకంగా టెక్ కంపెనీలు దాఖలు చేసిన పిటిషన్లకు అమెరికా మాజీ కార్యదర్శులు జాన్ కెర్రీ, మడెలైన్ అల్‌బర్ట్ లు మద్దతు తెలిపారు. ముస్లిం ప్రాబల్యం కలిగిన ఏడు దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించడంపై అమెరికాకు చెందిన 100 టెక్నాలజీ కంపెనీలు కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ట్రావెల్ బ్యాన్ వల్ల అమెరికా వ్యాపారపరంగా, అభివృద్ధిపరంగా.. తీవ్రంగా నష్టపోతుందని తాము వేసిన జాయింట్ పిటిషన్‌లో పేర్కొన్నాయి. ప్రఖ్యాత కంపెనీలైన ఆపిల్, ఫేస్‌బుక్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఇంటెల్, ఈబే, ఉబెర్, ట్విట్టర్‌లు పిటిషన్ దాఖలు చేసిన కంపెనీల్లో ఉన్నాయి.
(ట్రంప్పై టెక్ దిగ్గజాల లీగల్ వార్)
ట్రంప్ నిర్ణయం వల్ల దేశ భద్రతకు ముప్పువాటిల్లే అవకాశం ఉంటుందని, ప్రపంచదేశాల్లో ఉన్న అమెరికా బలగాలకు కూడా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇతర దేశాల నుంచి అమెరికా వచ్చిన ఎంతో మంది వారి పరిశోధనలతో అమెరికా అభివృద్ధి కారణమయ్యారని టెక్ కంపెనీలు తమ పిటిషన్‌లో పేర్కొన్నాయి. కాగా, ట్రంప్ ట్రావెల్ నిషేధాన్ని సీటెల్ కోర్టు నిలుపుదల చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ట్రంప్ దేశభద్రతకు ముప్పువాటిల్లితే ఆ బాధ్యత సదరు జడ్జి, న్యాయవ్యవస్ధ స్వీకరించాలని అన్నారు. ప్రస్తుతం ట్రావెల్ బ్యాన్ నిలుపుదల అంశం అమెరికా సుప్రీంకోర్టులో ఉంది.