13 పాక్ టీవీ చానళ్లకు భారీ జరిమానా
ఇస్లామాబాద్: మాజీ క్రికెటర్, ప్రముఖ రాజకీయ నాయకుడు ఇమ్రాన్ ఖాన్ మూడో పెళ్లి విషయంలో తప్పుడు వార్తలు ప్రసారం చేసినందుకుగానూ 13 పాక్ టీవీ చానళ్లకు పాకిస్తాన్ మీడియా వాచ్‌డాగ్ భారీ జరిమానా విధించింది. ఈ మేరకు ఒక్కో చానల్‌కు రూ.5 లక్షలు జరిమానా విధించినట్లు అధికారులు ఆదివారం వెల్లడించారు. తప్పుడు వార్తలపై పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్(పీటీఐ) ఇచ్చిన ఫిర్యాదును విచారించిన పాకిస్తాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ(పెమ్రా).. ఈ మేరకు సదరు చానళ్లకు జరిమానా విధించింది.
కాగా, ఈ చానళ్లు గతనెల 12న ఇమ్రాన్ ఖాన్ లండన్‌లో మూడో వివాహం చేసుకోబోతున్నాడని పదే పదే ప్రసారం చేశాయి. ఈ తప్పుడు వార్తా ప్రసారాలపై ఖాన్ పార్టీ పీటీఐ ఆగస్టు 26న పెమ్రాకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును విచారించిన పెమ్రా సదరు చానళ్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా తప్పుడు కథనాలను ప్రసారం చేయడం జర్నలిజం ప్రమాణామాలను, నియమాలను ఉల్లంఘించడమేనని పేర్కొంది.
సదరు ఒక్కో చానల్‌కు రూ.5లక్షల జరిమానా విధించింది. జరిమానాను చెల్లించకపోతే చానళ్లకు సంబంధించిన లెసైన్సులను రద్దు చేస్తామని పెమ్రా హెచ్చరించింది. కాగా, జరిమానా విధించిన చానళ్లలో దున్యా న్యూస్, జియో న్యూస్, నియో న్యూస్, రాయల్ న్యూస్, ఖైబర్ న్యూస్, చానల్ 24, చానల్ 92, న్యూస్ వన్, సచ్ టీవీ, రోజ్ న్యూస్, చానల్ 5, జియో తేజ్‌లు ఉన్నాయి.