సింగపూర్: ఉగ్రవాద కార్యకలాపాలు జరుపుతున్న 27 మంది బంగ్లాదేశీయులను అరెస్ట్ చేసినట్లు సింగపూర్ విదేశాంగ శాఖ బుధవారం ప్రకటించింది. తమ అంతర్గత భద్రతా విభాగం నవంబర్ 16 నుండి డిసెంబర్ 1 మధ్య కాలంలో ఈ అరెస్టులకు పాల్పడినట్లు సింగపూర్ వెల్లడించింది. నిర్మాణ రంగంలో కూలీలుగా పనిచేస్తున్న వీరంతా అల్ ఖయిదా, ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాద భావజాలానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
అరెస్టు అయిన వారిలో ఇప్పటికే 26 మందిని బంగ్లాదేశ్కు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. ఒకరు మాత్రం దేశం నుండి అక్రమంగా పారిపోతూ పట్టుబడటంతో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. శిక్ష పూర్తి కాగానే అతన్ని కూడా బంగ్లాదేశ్కు తరలించనున్నట్లు సింగపూర్ అధికారులు తెలిపారు. సొంత దేశం బంగ్లాదేశ్లోనే దాడులు జరపడానికి వీరు కుట్రపన్నినట్లు అధికారులు గుర్తించారు.