పాకిస్తాన్లో తుఫాను.. 35మంది మృతి
ఇస్లామాబాద్ : ఉత్తర, ఈశాన్య భారతంలో భూకంపం కల్లోలం సృష్టిస్తే , పాకిస్తాన్లో తుఫాను విరుచుకుపడింది. పెషావర్, ఛారసద్దా, నౌషరా, తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఈదురుగాలులతో తుఫాను బీభత్సం సృష్టించింద. ఫక్తునఖ్వాలో ప్రావిన్స్లోని ఖైబర్లో ఆదివారం సంభవించిన భారీ వర్షాలు , తుఫాను కారణంగా 35మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 150మంది తీవ్రంగా గాయపడ్డారు.
పెషావర్, ఛారసద్దా, నౌషరా తదితర ప్రాంతాల్లో భారీ వర్షం నమోదు అవడంతో ప్రజలు అతలాకుతలమయ్యారు. పెషావర్ 17 సెం.మీ వర్షపాతం నమోదైంది. 110కి.మీ వేగంతో భారీ ఎత్తున వీచిన గాలుల ధాటికి పలు ఇళ్లు నేలకూలాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. పలుచోట్ల గోడలు కూలిపోయాయి. విద్యుత్ స్థంబాలు నేలకొరిగాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. భద్రతా దళాలు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నాయి.