కొలంబో: వేదిక మారినా... భారత్, పాకిస్తాన్ క్రికెట్ జట్లను మాత్రం వర్షం వెంటాడుతోంది. ఆసియా కప్ టోర్నీలో భాగంగా ఈ రెండు జట్ల మధ్య గ్రూప్ దశ మ్యాచ్ వర్షార్పణం కాగా... ఆదివారం జరగాల్సిన ‘సూపర్–4’ దశ మ్యాచ్‌కూ వాన అంతరాయం కలిగించింది. వాతావరణ పరిస్థితిని ముందే ఊహించిన నిర్వాహకులు ఈ మ్యాచ్‌కు మాత్రమే ‘రిజర్వ్ డే’ కేటాయించగా... వారి అంచనా నిజం అయింది. ఫలితంగా భారత్, పాక్ ‘సూపర్–4’ మ్యాచ్ నేటికి వాయిదా పడింది. వర్షం వల్ల ఆట నిలిచిపోయే సమయానికి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 24.1 ఓవరల్లో 2 వికెట్లు కోల్పోయి 147 పరుగులు సాధించింది.
ఓపెనర్లు రోహిత్ శర్మ (49 బంతుల్లో 56; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు), శుబ్‌మన్ గిల్ (52 బంతుల్లో 58; 10 ఫోర్లు) ధాటిగా ఆడి అర్ధ సెంచరీలు చేశారు. తొలి వికెట్‌కు వీరిద్దరు 100 బంతుల్లో 121 పరుగులు జోడించారు. వర్షంతో ఆట నిలిచే సమయానికి విరాట్ కోహ్లి (16 బంతుల్లో 8 బ్యాటింగ్), కేఎల్ రాహుల్ (28 బంతుల్లో 17 బ్యాటింగ్; 2 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. మూడో వికెట్‌కు వీరిద్దరు అజేయంగా 24 పరుగులు జత చేశారు. సాయంత్రం గం. 4:50కు వర్షం మొదలై 5:30కు ఆగిపోయింది. సిబ్బంది పని మొదలుపెట్టగా అరగంట తర్వాత 6 గంటలకు వర్షం మళ్లీ వచ్చింది. పది నిమిషాల తర్వాత నిలిచిపోయింది.
కవర్లు తీసేసిన సిబ్బంది మళ్లీ తమ పని మొదలుపెట్టారు. ఈ క్రమంలో అంపైర్లు రెండుసార్లు మైదానాన్ని పరీశిలించారు. మ్యాచ్‌ను 34 ఓవర్లకు కుదించి రాత్రి 9 గంటలకు ఆట తిరిగి ప్రారంభించాలని అంపైర్లు ఆలోచిస్తున్న సమయంలో రాత్రి 8:30కు వర్షం మళ్లీ వచ్చింది. దాంతో అంపైర్లు మ్యాచ్‌ను నేటికి వాయిదా వేశారు. నేటి మధ్యాహ్నం 3 గంటల నుంచి భారత ఇన్నింగ్స్ 24.1 ఓవర్ల నుంచి మొదలవుతుంది. అయితే సోమవారం కూడా కొలంబోలో భారీ వర్షం పడే అవకాశముందని వాతావరణ శాఖ సమాచారమిచ్చింది.
స్కోరు వివరాలు
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) ఫహీమ్ అష్రఫ్ (బి) షాదాబ్ ఖాన్ 56; శుబ్‌మన్ గిల్ (సి) ఆగా సల్మాన్ (బి) షాహీన్ అఫ్రిది 58; కోహ్లి (బ్యాటింగ్) 8; కేఎల్ రాహుల్ (బ్యాటింగ్) 17; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (24.1 ఓవర్లలో 2 వికెట్లకు)147. వికెట్ల పతనం: 1–121, 2–123. బౌలింగ్: షాహీన్ 5–0– 37–1, నసీమ్ 5–1–23–0, అష్రఫ్ 3–0–15–0, రవూఫ్ 5–0–27–0, షాదాబ్ 6.1–1–45–1.
Comments
Please login to add a commentAdd a comment