దాయాదుల పోరుకు రంగం సిద్ధం.. ఆటనా... వర్షమా! | India vs Pakistan match in Asia Cup super 4 | Sakshi
Sakshi News home page

దాయాదుల పోరుకు రంగం సిద్ధం.. ఆటనా... వర్షమా!

Published Sun, Sep 10 2023 1:25 AM | Last Updated on Sun, Sep 10 2023 1:14 PM

India vs Pakistan match in Asia Cup super 4 - Sakshi

కొలంబో: ఆసియా కప్‌లో మరోసారి భారత్, పాకిస్తాన్‌ మధ్య సమరానికి సమయం ఆసన్నమైంది. ‘సూపర్‌ 4’ దశలో భాగంగా ప్రేమదాస స్టేడియంలో నేడు జరిగే పోరులో ఇరు జట్లు తలపడనున్నాయి. లీగ్‌ దశలో ఈ నెల 2న భారత్, పాక్‌ తలపడిన మ్యాచ్‌ వర్షం కారణంగా అర్ధాంతరంగా రద్దయింది. దాంతో అభిమానుల ఆసక్తి, ప్రసారకర్తల విజ్ఞప్తిని దృష్టిలో ఉంచుకొని నేటి మ్యాచ్‌కు ‘రిజర్వ్‌ డే’ను కేటాయించారు.

అయితే ఆదివారం నగరంలో 90 శాతం వర్షసూచన ఉండగా...సోమవారం కూడా పరిస్థితి దాదాపు అలాగే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వాన అంతరాయం లేకుండా మ్యాచ్‌లో ఫలితం వస్తుందా అనేది ఆసక్తికరం. పిచ్‌ కూడా బౌలర్లకే అనుకూలంగా కనిపిస్తోంది. ఇటీవల రికార్డు చూస్తే బ్యాటింగ్‌లో సాధారణ స్కోర్లే నమోదయ్యాయి.  

రాహుల్‌పైనే దృష్టి... 
పాకిస్తాన్‌లో జరిగిన తొలి పోరులో భారత బ్యాటింగ్‌ తడబడింది. 66 పరుగులకే టాప్‌–4 వెనుదిరిగారు. హార్దిక్‌ పాండ్యా, ఇషాన్‌ కిషన్‌ ఆదుకోవడంతో జట్టు కాస్త చెప్పుకోదగ్గ స్కోరు నమోదు చేయగలిగింది. ఈ నేపథ్యంలో మన బ్యాటింగ్‌ మరింత మెరుగైన ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది. నేపాల్‌తో జరిగిన గత మ్యాచ్‌తో పోలిస్తే టీమ్‌లో రెండు మార్పులు ఖాయం. వ్యక్తిగత కారణాలతో గత మ్యాచ్‌ ఆడని బుమ్రా తిరిగొచ్చి జట్టుతో చేరాడు. దాంతో షమీ స్థానంలో అతను ఆడటం ఖాయమైంది. బ్యాటింగ్‌ విభాగంలో ఇప్పుడు అందరి దృష్టి కేఎల్‌ రాహుల్‌పైనే నిలిచింది.

ఈ ఏడాది మార్చి తర్వాత రాహుల్‌ వన్డే మ్యాచ్‌ ఆడలేదు. గాయంనుంచి కోలుకున్న తర్వాత ఇప్పుడు అతని బ్యాటింగ్‌తో పాటు ఫిట్‌నెస్‌ ప్రదర్శన కూడా కీలకం కానుంది. తుది జట్టులో ఇషాన్‌ కిషన్‌ స్థానంలో అతను జట్టులోకి వస్తాడు. తాను ఆడిన గత నాలుగు వన్డేల్లో నాలుగు అర్ధ సెంచరీలు చేసినా... మిడిలార్డర్‌లో రాహుల్‌ కోసం కిషన్‌ను పక్కన పెట్టక తప్పదు.

కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ వరల్డ్‌ కప్‌ ప్రణాళికల్లో భాగంగా కేఎల్‌ రాహుల్‌ను ఇప్పుడు అన్ని విధాలా అన్ని మ్యాచ్‌లలో పరీక్షించాల్సి ఉంది. రోహిత్, గిల్, కోహ్లి ఈ సారైనా జట్టు స్కోరుకు మంచి పునాది వేయాల్సి ఉంది. పాక్‌తో మ్యాచ్‌లో విఫలమైన శ్రేయస్‌ కూడా తన ఫామ్‌ను నిరూపించుకోవాల్సి ఉంది. బౌలింగ్‌ విభాగం బుమ్రా, సిరాజ్, జడేజా, కుల్దీప్‌లతో పటిష్టంగా ఉంది. ఆల్‌రౌండర్‌గా శార్దుల్‌కు ఇది మరో కీలక అవకాశం.  

ఆ ముగ్గురు... 
పాకిస్తాన్‌ పేస్‌ బౌలింగ్‌ త్రయం షాహిన్, రవూఫ్, నసీమ్‌ ఇప్పుడు ప్రపంచ క్రికెట్‌లో పదునైన బౌలింగ్‌ బృందంగా కనిపిస్తోంది. తొలి మ్యాచ్‌లో భారత్‌ను ఈ ముగ్గురూ బాగా ఇబ్బంది పెట్టారు. వారు అదే జోరు కొనసాగించి తమ జట్టును ముందంజలో నిలపాలని పాక్‌ మేనేజ్‌మెంట్‌ కోరుకుంటోంది. భారత్‌తో గత మ్యాచ్‌లో టీమ్‌కు బ్యాటింగ్‌ అవకాశమే రాలేదు కాబట్టి వారి ప్రదర్శనపై ఒక అంచనాకు రావడం కష్టం.

అయితే ఇతర మ్యాచ్‌లను బట్టి చూస్తే ఓపెనర్లు ఇమామ్, ఫఖర్‌లతో పాటు మూడో స్థానంలో కెపె్టన్‌ బాబర్‌ బ్యాటింగే జట్టు గెలుపోటములను నిర్దేశించవచ్చు. మిడిలార్డర్‌లో రిజ్వాన్, సల్మాన్, ఇఫ్తికార్‌ మెరుగైన ప్రదర్శన ఇవ్వగలరు. సూపర్‌ 4 దశలో పాక్‌ తమ తొలి మ్యాచ్‌లో బంగ్లాను చిత్తు చేసింది. భారత్‌తో ఆడిన గత మ్యాచ్‌తో పోలిస్తే ఈ సారి పాక్‌ టీమ్‌లో ఒక మార్పు జరిగింది. లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ నవాజ్‌ స్థానంలో పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ ఫహీమ్‌కు అవకాశం దక్కింది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement