
ఓట్టావా : 35 ఏళ్ల క్రితం జూన్ 23న ఎయిర్ ఇండియా విమానం 182పై జరిగిన ఉగ్రదాడి కెనడా చరిత్రలోనే అత్యంత దారుణమైనదని, ఉగ్రవాదుల దుర్మార్గపు చర్యకు ఆ ఘటన నిదర్శనమని ప్రధాని జస్టిన్ ట్రూడో వ్యాఖ్యానించారు. ఎయిర్ ఇండియా ఫ్లయిట్ 182 ఎంపరర్ కనిష్కలో ఉగ్రవాదులు బాంబు పెట్టిన ఘటన జరిగి 35 సంవత్సరాలు అవుతున్న సందర్బంగా బాధిత కుటుంబాలు ఓ ప్రత్యేక యూట్యూబ్ ఛానల్ ద్వారా వీడియోలతో నివాళులు అర్పించాయి. ఈ సందర్భంగా ప్రధాని జస్టిన్ సైతం ఓ వీడియోలు విడుదల చేశారు. ఆ వీడియోలో.. దేశానికి అదో పెద్ద షాకని, అప్పటి సామూహిక భద్రతను ప్రమాదంలో పడేసిందని అన్నారు. కెనడా నుంచి యూకే వెళుతున్న విమానం పేలటంతో 329 మంది అమాయకులు మరణించారని, వారిలో 280 మంది కెనడియన్లు ఉన్నారని అన్నారు.('జగ్మీత్ సింగ్ అంశం నన్ను బాధించింది')
కాగా, 1985 జూన్ 23న ఎయిర్ ఇండియా విమానం 182, ఎంపరర్ కనిష్కలో ఖాలిస్తాని ఉగ్రవాదులు బాంబు పెట్టారు. ఈ ఘటనలో 329 మంది మృత్యువాత పడ్డారు. దారుణ సంఘటనకు గుర్తుగా జూన్ 23వ తేదీని ‘‘ నేషనల్ డే ఆఫ్ రిమెంబరెన్స్ ఫర్ విక్టిమ్స్ ఆఫ్ టెర్రరిజమ్ ఇన్ కెనడా’’గా జరుపుకుంటున్నారు. ఆ రోజున బాధిత కుటుంబాలు అంతా ఒక చోట చేరి చనిపోయిన తమ వారికి నివాళులు అర్పిస్తుంటారు. అయితే ఈ సంవత్సరం కోవిడ్-19 పరిస్థితుల కారణంగా సామూహిక సమావేశాలపై ఆంక్షలు ఉండటంతో యూట్యూబ్ ఛానల్ ద్వారా నివాళులు అర్పించారు. కొంతమంది మాత్రమే అక్కడి స్మారక స్థలాల వద్దకు వెళ్లి నివాళులు అర్పించారు.