![62 Nations To Seeks Impartial Probe Into Covid 19 Crisis Include India - Sakshi](/styles/webp/s3/article_images/2020/05/18/WHO.jpg.webp?itok=QaXijCHP)
జెనీవా: మహమ్మారి కోవిడ్-19 పుట్టుక, వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) స్పందన, కరోనా సంక్షోభంపై స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలన్న ఆస్ట్రేలియా, యూరోపియన్ యూనియన్ నిర్ణయానికి భారత్ సహా 62 దేశాలు మద్దతు ప్రకటించాయి. ఈ మేరకు సోమవారం ప్రారంభమైన డబ్ల్యూహెచ్‌ఓ అసెంబ్లీ సమావేశాల్లో ముసాయిదా తీర్మానానికి ఆమోదం తెలిపినట్లు సమాచారం. కోవిడ్-19 విషయంలో డబ్ల్యూహెచ్‌ఓ స్పందనపై నిష్పాక్షిక, సమగ్ర విచారణకై తొలుత ఆస్ట్రేలియా పిలుపునివ్వగా.. ఈయూ ఇందుకు మద్దతు పలికింది. ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని ఈరోజు వరల్డ్ హెల్త్ అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ప్రాణాంతక వైరస్ ఉద్భవించిన నాటి నుంచి ప్రపంచ దేశాలను అప్రమత్తం చేయడం.. నియంత్రణ చర్యలకై సభ్య దేశాలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరపడం తదితర అంశాల్లో అంతర్జాతీయ సంస్థ స్పందించిన తీరుపై దర్యాప్తు చేపట్టాల్సిందిగా కోరాయి. (అది మనుషులకు ప్రమాదం: డబ్ల్యూహెచ్‌వో)
ఈ క్రమంలో జపాన్, యూకే, న్యూజిలాండ్, దక్షిణ కొరియా, బ్రెజిల్, కెనడా, భారత్ వంటి 62 దేశాలు వీటికి మద్దతు పలికాయి. మరోవైపు... కరోనా బయటపడిన తర్వాత తొలిసారిగా వరల్డ్ హెల్త్ అసెంబ్లీ 73వ వార్షిక సమావేశం సోమవారం జెనీవాలో ప్రారంభమైంది. కరోనా సంక్షోభానికి కేంద్ర బిందువుగా భావిస్తున్న చైనాపై విచారణకు ఈ వేదికను ఉపయోగించుకోవాలని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. అదే సమయంలో తనపై వస్తున్న ఆరోపణలకు చైనా ధీటుగా బదులిచ్చేందుకు చైనా సైతం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా డబ్ల్యూహెచ్‌ఏ నుంచి తైవాన్‌కు ఆహ్వాన ప్రతిపాదనపై పలు దేశాలు మద్దతునివ్వడాన్ని కూడా చైనా తప్పుబట్టింది. ఇదిలా ఉండగా.. వైరస్‌కు జన్మస్థానంగా భావిస్తున్న చైనాలోని వుహాన్ నగరం పేరును మాత్రం డ్రాఫ్ట్ రిసల్యూషన్‌లో ప్రస్తావించకపోవడం గమనార్హం.(భారత్ మద్దతు ఇస్తుందని ఆశిస్తున్నాం: తైవాన్)
Comments
Please login to add a commentAdd a comment