![78 killed in Mogadishu car bomb attack - Sakshi](/styles/webp/s3/article_images/2019/12/29/SOMALIA-2.jpg.webp?itok=T3DTdOHG)
పేలుడు ధాటికి పూర్తిగా దెబ్బతిన్న కారు
మొగదిషు: సోమాలియా రాజధాని మొగదిషులో శనివారం సంభవించిన భారీ కారు బాంబు పేలుడులో 78 మంది ప్రాణాలు కోల్పోయారు. రాజధానికి నైరుతి ప్రాంతంలోని చెక్‌పోస్ట్ వద్ద ట్రాఫిక్ భారీగా ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది. పేలుడు ధాటికి ఘటనా ప్రాంతంలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. కొన్ని మృతదేహాలు గుర్తు పట్టడానికి కూడా వీల్లేకుండా కాలిపోయాయి. కొన్ని వాహనాలు మంటల్లో పూర్తిగా కాలిపోగా మరికొన్ని నుజ్జునుజ్జయ్యాయి.
ఈ ఘటనలో కళాశాల బస్సు పేలిపోవడంతో మృతుల్లో అత్యధికులు విద్యార్థులే ఉన్నారు. ప్రస్తుతానికి మృతులు 78 మంది, క్షతగాత్రులు 125 వరకు ఉన్నప్పటికీ ఈ సంఖ్య ఇంకా పెరిగే సూచనలున్నాయని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు బాధ్యత తమదేనంటూ ఏ ఉగ్ర సంస్థా ఇప్పటివరకు ప్రకటించుకోలేదు. అల్ ఖాయిదా అనుబంధ అల్ షబాబ్ దేశంలో తరచూ కారు బాంబు దాడులకు పాల్పడుతోంది. శనివారం జరిగిన పేలుడు రెండేళ్లలోనే అత్యంత తీవ్రమైంది. 2017లో మొగదిషులో ట్రక్కు బాంబు పేలి 512 మంది చనిపోగా 300 మంది గాయపడ్డారు.
నెత్తురోడుతున్న బాధితుడిని ఆస్పత్రికి తరలిస్తున్న స్థానికులు
Comments
Please login to add a commentAdd a comment