జీవిత కల కోసం 99వ ఏట జైలుకి..
సాధారణంగా 99 ఏళ్లంటే కదిలే ఓపిక కూడా ఉండదు.. రామా కృష్ణా అంటూ ఓ మూలకు మూలుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువవుతాడు. అదీ కాకుండా అంతపెద్ద వయసులో పెద్దగా లక్ష్యాలు, కోరికలు అస్సలే ఉండవు.. పోతే బావుండు బోడి ప్రాణం అనిపించడం తప్ప. కానీ, డచ్ దేశంలో ఎన్నియే అనే 99 ఏళ్ల బామ్మ తాను చక్కగా ఆరోగ్యంగా ఉండటమే కాదు.. ఆ కదలలేని వయసులో జైలు కెళ్లింది. పోలీసులు తనకు బేడీలు వేస్తుంటే చిరునవ్వులు చిందించింది. వారికి ధన్యవాదాలు తెలిపింది. అయితే, అదేదో నేరం చేసి ఆమె జైలుకు వెళ్లలేదు.
అలా ఒకసారైన జైలుకు వెళ్లాలనుకోవడం తన జీవితకాల కోరిక అంట. తన జీవితంలో చేయాలనుకున్నవన్నింటిని చేసిన ఆ పెద్దవ్వకు జైలు బేడీలు వేయించుకోవాలని, జైలు గదిలో గడపాలని కోరిక ఉండేదట. ఈ విషయాన్ని ఆమె ఉంటున్న నిజ్మెజెన్ జూయిడ్ పోలీసులకు తెలియజేయడంతో ఆమె చివరి కోరికను మన్నించి డచ్ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తీసుకెళ్లారు.
బేడీలు వేశారు. ఆ తర్వాత ఆమె సరదాగా కొద్ది సేపు జైలుగదిలో గడిపింది. దీనికి సంబంధించి లెఫ్టినెంట్ పీటర్ స్మిత్ వివరాలు తెలియజేస్తూ ‘తన మొత్తం జీవితకాలంలో కూడా ఎన్నియే ఒక్క నేరం కూడా చేయలేదు. ఆమెకు జైలు జీవితం ఎలా ఉంటుందో అస్వాధించాలని అనిపించింది. మేం మా పోలీస్ సైట్‌లో పోస్ట్ చేసిన ఫొటోలు చూస్తే ఆమె ఎంత ఉల్లాసంగా జైలు గదిలో ఉందో మీకే అర్థం అవుతుంది’ అని చెప్పారు.