
ఏకంగా ఉగ్రవాదినే చంపబోయిన ట్యాక్సీ డ్రైవర్!
మాంచెస్టర్ మారణకాండ నుంచి తేరుకోకముందే బ్రిటన్‌పై మరోసారి పంజా విసిరిన ఉగ్రవాదులు ఆరుగురిని పొట్టన పెట్టుకున్నారు.
లండన్: మాంచెస్టర్ మారణకాండ నుంచి తేరుకోకముందే బ్రిటన్‌పై మరోసారి పంజా విసిరిన ఉగ్రవాదులు ఆరుగురిని పొట్టన పెట్టుకున్నారు. సెంట్రల్ లండన్‌లో థేమ్స్ నదిపై ఉన్న ‘లండన్ బ్రిడ్జి’పై వ్యాన్‌ను వేగంగా నడుపుతూ పాదచారులను తొక్కించేస్తూ ఉగ్రవాదులు బీభత్సం సృష్టించారు. అయితే అదే సమయంలో ఓ టాక్సీ డ్రైవర్ ఏకంగా ఉగ్రవాదులనే అంతమొందించేందుకు యత్నించాడు. కత్తులతో జనాలపై విచక్షణా రహితంగా దాడిచేస్తున్న ఓ ఉగ్రవాదిని తన కారుతో ఢీకొట్టి హతమార్చాలని చూడగా.. ఆ ఉగ్రవాది తప్పించుకున్నాడు. ఒకవేళ తాను చేసిన ప్రయత్నం ఫలించి ఉంటే కొందరు అమాయకుల ప్రాణాలు దక్కేవని ట్యాక్సీ డ్రైవర్ క్రిస్ ఆవేదన వ్యక్తం చేశాడు.
‘నేను చూస్తుండగానే లండన బ్రిడ్జి పైనుంచి ఓ వ్యాన్ వేగంగా జనాలపైకి దూసుకొచ్చింది. దాంతో జనాలు చెల్లాచెదురైపోయారు. ఇక్కడి నుంచి త్వరగా పారిపోండి అంటూ గట్టిగా అరిచాను. వ్యాన్ ఆపి అందులో నుంచి ముగ్గురు ఉగ్రవాదులు దాదాపు 12 ఇంచుల పొడవైన కత్తులతో దిగారు. ఓ యువతిని ఏకంగా 15-20సార్లు కడుపులో పొడిచి చంపేయడం చూశాను. జనాలపై దాడి చేస్తున్న ఓ ఉన్మాదిని అంతం చేయాలని.. నా కారుతో ఢీకొట్టి చంపేయాలని చూశాను. అయితే తృటిలో తప్పించుకున్నాడు. అదృష్టవశాత్తూ నేను కూడా ఉగ్రవాది నుంచి తప్పించుకోగలిగాను.
మూడు కార్లలో పోలీసులు వెంటనే అక్కడికి వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. అయితే జనాలు అప్పటికే ప్రాణ భయంతో పరుగులు తీశారని’ ప్రత్యక్ష సాక్షి అయిన టాక్సీ డ్రైవర్ క్రిస్ వివరించాడు. మే 22న బ్రిటన్ పారిశ్రామిక నగరం మాంచెస్టర్‌లో ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతిదాడిలో 22 మంది చనిపోయిన విషయం తెలిసిందే.