చేపలతో ఆస్ట్రేలియా జీవజాలానికి ముప్పు
సిడ్నీ: ఆస్ట్రేలియా సముద్ర జీవజాలానికి ఆ దేశంలోకి దండెత్తి వచ్చే చేపల నుంచి పెద్ద ముప్పు పొంచి ఉందని అక్కడి శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఆస్ట్రేలియా సమీపంలోని పపువా న్యూ గినియా సముద్ర తీరంలో ఉండే అభివృద్ధి చెందిన పెర్క్ జాతి చేపలతో ప్రమాదం పొంచి ఉన్నట్లు, ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని వారు ప్రభుత్వానికి సూచించారు. పెర్క్ (అనాబస్ టెస్టుడినియస్) జాతి చేప నీటి బయట, పొడి వాతావరణంలో సైతం ఆరు గంటలు జీవించగలదు. ఈ అరుదైన లక్షణం కలిగిన చేప ఇప్పటికే ఆస్ట్రేలియాకు చెందిన రెండు దీవులకు విస్తరించినట్లు పరిశోధకులు తెలిపారు.
ఈ చేపలు ఉన్న ప్రాంతంలో ఇతర జీవులు ఎదిగేందుకు అవకాశం ఉండదు. ఇవి ఒకేసారి భారీ సంఖ్యలో వలస వస్తాయి. దీని వల్ల ఇతర జీవులకు ఆహారం దొరకడం కష్టమవుతుందని నిపుణులు తెలిపారు. భారీ స్థాయిలో ఇవి దండెత్తడంతో స్థానిక జీవులు మనుగడ కోల్పోయే ప్రమాదముందని హెచ్చరించారు. ఒకవేళ ఇతర పెద్ద చేపలేవైనా వీటిని తినాలని చూస్తే వాటికే హాని కలుగుతుందన్నారు. ఆయా జీవులు ఈ చేపలను మింగగానే మొప్పల సాయంతో వాటి గొంతులను కోయగలిగే శక్తి వీటికి ఉందన్నారు.
దీంతో ఏ జీవి పెర్క్ చేపలను తినాలని చూసినా అవి కోతకు గురై మరణించే అవకాశం ఉంది. ఈ కారణాలతో పెర్క్ చేపలు ఆస్ట్రేలియా సముద్రాల్లోకి వలస రాకుండా నిరోధించాలని, లేకుంటే ఇతర సముద్ర జీవజాలం మనుగడ కష్టమవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఆస్ట్రేలియా సున్నితమైన పర్యావరణాన్ని కలిగి ఉంది. ఆ దేశానికి చెందిన జీవజాలాన్ని సంరక్షించేందుకు అక్కడి శాస్త్రవేత్తలు తీవ్రంగా కృషి చేస్తున్నారు.