గుడ్ జాబ్ ఇండియా: పాక్‌లో రియాక్షన్
ఇస్లామాబాద్: భారత్ మరోసారి పాకిస్థాన్ శిబిరాలపై సర్జికల్ స్ట్రైక్స్ తరహా దాడులను నిర్వహించడంపై అక్కడి పౌరులు సానూకూలంగా స్పందించారు. భారత ఆర్మీ చాలా మంచిపని చేసిందంటూ ప్రశంసల్లో ముంచెత్తారు. ప్రధాని నరేంద్రమోదీ చాలా గ్రేట్ అంటూ కూడా కితాబిచ్చారు. భారత్ అసలు తమ శిబిరాలపై భారత్ దాడులే నిర్వహించలేదంటూ పాకిస్థాన్ ఆర్మీ కొట్టిపారేసిందంటూ డాన్ పత్రిక వార్తను ప్రచురించగా దానికి పై విధంగా పాక్ పౌరులు కొందరు స్పందించారు. నియంత్రణ రేఖ వద్ద నుంచి చొరబాట్లు ఎక్కువై కశ్మీర్‌లో ఆందోళనలకు కారణం అవుతున్న నేపథ్యంలో భారత ఆర్మీ ఈనెల 20, 21 తేదీలలో దాడలు జరిపింది.
జమ్ము కశ్మీర్ రాష్ట్రంలోని నౌషేరా ప్రాంతం సమీపంలో ఉన్న పాకిస్తాన్ శిబిరాలపై భారత భద్రతా దళాలు ముమ్మరంగా కాల్పులు జరిపి ధ్వంసం చేసింది. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పాకిస్తానీ శిబిరాలను పూర్తిగా ధ్వంసం చేసింది. దీనికి సంబంధించిన వీడియోలు కూడా బయటపెట్టింది. అయితే, భారత్ చేస్తుందంతా కూడా తప్పుడు ప్రచారం అంటూ పాక్ అంతర్గత సేవల ప్రజాసంబంధాల డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ అసిఫ్ ఘఫూర్ ఓ ట్వీట్ చేశారు. ‘నౌషెరా సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వద్ద పాక్ స్థావరాలను ధ్వంసం చేసినట్లు భారత్ చెప్పింది. ఇదంతా కూడా అబద్ధం’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఇక ఈ దాడులను భారత్‌లో పాకిస్థాన్ హైకమిషనర్‌గా అబ్దుల్ బాసిత్ కూడా తోసిపుచ్చారు. అసలు అలాంటి సమాచారం ఏది తమకు ఇంకా పాక్ నుంచి రాలేదని అన్నారు.
ఇది తమకు తాము డంబంగా చెప్పుకోవడం కాదన్నారు. శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలనే తాము గట్టిగా నొక్కి చెబుతున్నామని తెలిపారు. భారత్‌తో చర్చలకు పాక్ సిద్ధంగా ఉందని చెప్పిన ఆయన ఈ విషయంలో అలా ఎందుకు చర్చించుకోకూడదని ప్రశ్నించారు. ఉగ్రవాదం పాక్‌కు కూడా పెద్ద సమస్య అని, తీవ్ర ఆందోళన అని చెప్పిన బాసిత్.. చర్చలకు తామేం సిగ్గుపడటం లేదని అన్నారు. అన్ని సమస్యలకు మూలం కశ్మీర్‌లో ఉందనే చెప్పారు.