భయానక క్షణం నుంచీ..
మూడేళ్ళ క్రితం ఆమె... మెర్సీ కిల్లింగ్ కు పర్మిషన్ ఇమ్మంటూ కోర్టుకు అర్జీ పెట్టుకుంది. సగం కాలిన గాయాలతో, చూపు, వినికిడి కోల్పోయి బతకడమే కష్టంగా ఉందంటూ కోర్టును వేడుకుంది. అయితే ఇప్పుడామె బతకాలనుకుంటోంది. తనవంటి బాధితులకు జీవితంపై ఆశ కల్పించి, అండగా నిలబడి న్యాయంకోసం పోరాడేందుకు సిద్ధమైంది.
పదేళ్ళక్రితం ఝార్ఖండ్ కి చెందిన సోనాలీ ముఖర్జీ.. ముగ్గురు దుండగుల యాసిడ్ దాడినుంచీ కేవలం ప్రాణాలతో బయట పడింది. అది.. 2002 సంవత్సరం. అప్పుడామెకు పదిహేడేళ్ళ వయసు. అందరిలాగే కాలేజీ జీవితాన్ని హాయిగా గడుపుతోంది. కానీ ఆమెపై కన్నేసిన దుండగులు ఎంత బతిమలాడినా ఆమెను వదల్లేదు. ఆఖరికి ఆమె తండ్రి కూడ వేడుకున్నాడు. తన కూతరి వెంట పడొద్దని. కొన్నాళ్ళు ప్రశాంతంగా జరిగిపోయింది. అయితే ఆ ప్రశాంతత వెనుక తుఫాను లాంటి భయం ఉందని వారు గమనించలేదు. దుండగులు రహస్యంగా పన్నిన పన్నాగంలో సోనాలీ చిక్కుకుపోయింది. యాసిడ్ దాడిలో కాలిన ముఖంతోపాటు, కళ్ళు చాలా వరకు దెబ్బతిన్నాయి. వినికిడి శక్తి కొంతశాతం కోల్పోయింది. డాక్టర్లు కూడ ఇంతటి దారుణాన్ని తామెప్పుడూ చూడలేదన్నారు. అయితే ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆమెకు ఎంతగానో సహకరించారు.
గత పదేళ్ళలో ఆమె ముఖాన్నికొంతవరకైనా సాధారణ స్థితికి తెచ్చేందుకు కనీసం 28 సార్లు ప్లాస్టిక్ సర్జరీ నిర్వహిచారు. భవిష్యత్తులో కూడ మరెన్నో చికిత్సలు చేయాల్సి ఉంది. అయినా ఆమె సగం కాలిన ముఖంతోనే జీవితం గడపాల్సి ఉంది. కానీ ఆమెపై దాడి చేసిన దుండగులు మాత్రం కేవలం రెండున్నరేళ్ళ జైలు శిక్ష అనుభవించి బయటకొచ్చేశారు. ప్రశాతంగా జీవితం గడుపుతున్నారు. 2012 లో సోనాలీ కోర్టును ఆశ్రయించింది. ఇండియాలో అమలులోలేని.. మెర్సీ కిల్లింగ్ కు పర్మిషన్ ఇవ్వాలని అర్జీ పెట్టుకుంది. ''నాకు న్యాయం జరగడం లేదు, నేనీ బాధ భరించలేను. సగం ముఖంతో మిగిలిన సగం జీవితాన్నిజీవించలేను. నాకు మిగిలిన మార్గం ఒక్కటే. నా ప్రాణం తీసుకునేందుకు పర్మిషన్ ఇవ్వండి'' అంటూ వేడుకుంది.
అయితే 2013 లో జరిగిన ఘటన ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఇండియాలోనే అతిపెద్ద టీవీ కార్యక్రమం కౌన్ బనేగా కరోడ్ పతి లో పాల్గొన్న ఆమెను చూసిన చిత్తరంజన్ తివారి ఫేస్ బుక్ ద్వారా పలకరించాడు. ఆ స్నేహం ప్రేమగా మారి పెళ్ళికూడ చేసుకునేందుకు అంగీకరించాడు. ఈ ఏడాది ఏప్రిల్ లో వారి వివాహం జరిగింది. '' నాకు పెళ్ళవుతుందని నేను ఏమాత్రం ఊహించలేదు. పదేళ్ళుగా నన్ను నేను నిలబెట్టుకునేందుకు ఎంతో ప్రయాస పడ్డాను. కానీ పెళ్ళి జరుగుతుందని మాత్రం కలలో కూడ అనుకోలేదు'' అంటుంది సోనాలి. ఇప్పుడామె ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగుతోంది. తనవంటి బాధితులకు అండగా నిలబడి, న్యాయ పోరాటం చేసేందుకు కృషి చేస్తోంది.
లండన్ కు చెందిన ఓ సేవా సంస్థ, యాసిడ్ సర్వైవర్స్ ఇంటర్నేషనల్ లెక్కల ప్రకారం... సంవత్సరంలో సుమారు పదిహేను వందల యాసిడ్ అటాక్స్ జరుగుతున్నట్లు లెక్కలు చెప్తున్నాయి . అందులో 80 శాతం బాధితులు మహిళలే ఉంటున్నారు. చాలామంది విషయాన్ని బహిర్గతం చేసేందుకు భయపడతున్నారు. అయతే అటువంటి క్రిమినల్స్ కు తగిన శిక్ష పడటం లేదని, వారు ఎంతో హాయిగా తిరుగుతుంటే బాధితులు నరకం చూస్తున్నారని సోనాలి చెప్తోంది. బాధితులకోసం న్యాయ పోరాటానికి తాను సిద్ధమంటోంది.