ఆయుధాల అడ్డా..
మనం కిరాణా షాపుకెళ్లి.. పప్పులు ఉప్పులు కొంటాం.. అదే ఇక్కడికెళ్తే.. ఏకే 47లు, మెషీన్ గన్లు, పిస్టళ్లు కొనుక్కోవచ్చు. ఇక్కడ కిరాణా షాపులున్నట్లే.. అక్కడ ఆయుధాలు అమ్మే దుకాణాలు ఉంటాయి..! ఇంతకీ ఎక్కడ? పాకిస్థాన్‌లోని దర్రా ఆదం ఖేల్ చిన్న పట్టణమే.. అయితే.. అక్రమాయుధాలకు పెద్ద అడ్డా. ఇక్కడ ప్రధాన వీధికి రెండు వైపులా దుకాణాలు. అన్నీ గన్‌లు అమ్మేవే! ఇక్కడి ప్రజల్లో 75 శాతం మంది ఇదే బిజినెస్‌లో ఉన్నారు. ఏ మోడల్ గన్‌ను అయినా.. ఇక్కడ లోకల్‌గా దొరికే సామాన్లతో వీరు డూప్లికేట్‌ను తయారుచేసేసి అమ్మేస్తారు.
పెన్నుల్లో ఇమిడిపోయే గన్‌ల దగ్గర్నుంచి.. యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ ఆయుధాల వరకూ అన్నీ.. గత 150 ఏళ్లుగా ఇక్కడి బిజినెస్ మూడు గన్నులు ఆరు గ్రనేడ్లుగా వర్థిల్లుతోంది. ముఖ్యంగా తాలిబన్లు వంటి టైస్టులు వీరి వద్ద నుంచి ఎక్కువగా ఆయుధాలను కొనుగోలు చేస్తారని చెబుతారు. కొన్నాళ్లు ఈ వ్యవహారాన్ని పెద్దగా పట్టించుకోని పాక్ ప్రభుత్వం.. చివరికి ఈ ఆయుధాలను టైస్టులు తమపైకి గురిపెట్టేసరికి.. కొన్నిసార్లు దాడులు జరిపింది. భారీ ఆయుధాల తయారీని నిషేధించింది. అయినప్పటికీ.. షరామామూలే..