
ఆఫ్ఘాన్ లో 141 మంది తాలిబన్లు హతం
కాబూల్: తాలిబన్ల ఏరివేత చర్యలు అటు పాకిస్థాన్ లోనూ, ఇటు ఆఫ్ఘనిస్థాన్ లోనూ ముమ్మరంగా సాగుతున్నాయి. ఆఫ్ఘానిస్థాన్ లో 141 మంది తాలిబన్ ఉగ్రవాదులను అంతమొందించారు. గత నలభై గంటల నుంచి శనివారం ఉదయం వరకూ కొనసాగించిన ఆపరేషన్ లో భారీ స్థాయిలో తాలిబన్లు మృతి చెందినట్లు ఆఫ్ఘాన్ రక్షణ శాఖ సృష్టం చేసింది. కునార్, నాన్ గార్హర్, ఘంజీ, హెల్మాండ్, ఉరుంగజ్, బాల్క్ తదితర ప్రాంతాల్లో చేపట్టిన ఆపరేషన్ లో 141 తాలిబన్లు మృతిచెందినట్లు పేర్కొంది.
ఈ ఆపరేషన్ లో తాలిబన్ల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైనట్లు రక్షణశాఖ అధికారి ఒకరు తెలిపారు. తాలిబన్ల నుంచి భారీ ఆయుధాలతో పాటు, బాంబులతో దాడులకు పాల్పడ్డారని పేర్కొన్నారు. గత రెండు రోజుల నుంచి రోడ్డు ప్రక్కన తాలిబన్లు పాతిపెట్టిన 115 బాంబులతో పాటు మందుపాతరలను కూడా స్వాధీనం చేసుకున్నారు.