‘నాకోసమైనా వారిని కాపాడాలి’
అగస్టాలో సోనియా, రాహుల్‌లపై మధ్యవర్తి మిచెల్
దుబాయ్: అగస్టా కుంభకోణంలో మధ్యవర్తిగా ఉన్న మిచెల్ క్రిస్టియన్ తనెప్పుడూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌లను కలవలేదని స్పష్టం చేశారు. ఎన్డీటీవీకి దుబాయ్ నుంచి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో.. గాంధీ కుటుంబానికి ఈ ముడుపులతో సంబంధం లేదని వెల్లడించారు.‘హెలికాప్టర్ల కుంభకోణానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకునేది సోనియా గాంధీయేనని తెలుసు. అందుకే ఓ లేఖలో ‘ద డ్రైవింగ్ ఫోర్స్’గా సోనియాను పేర్కొన్నాను. అంతకుమించి సోనియా, రాహుల్‌లను నేనుప్పుడూ వ్యక్తిగతంగా కలవలేదు.
వారితో లాబీయింగ్ చేయించాలని ప్రయత్నించినా కుదరలేదు’ అని మిచెల్ ఈ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ‘ఈ కుంభకోణంతో వారికి సంబంధం లేదని నిరూపించటం ద్వారా నేను అమాయకుడనని నిరూపించుకోవాలి’ అని అన్నారు. భారత ప్రధాని మోదీ, ఇటలీ ప్రధాని మధ్య న్యూయార్క్‌లో జరిగిన సమావేశంలో అగస్టా కేసుకు సంబంధించిన సమాచారం ఇస్తే.. ఇటాలియన్ నావికుల విడుదల చేస్తామని మాట్లాడుకున్నారంటూ గతంలో తను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని మిచెల్ వెల్లడించారు.
మిచెల్‌తోపాటు జైల్లో ఉన్న ఇద్దరు అగస్టా ప్రతినిధులు రాసిన లేఖలు, దీనిపై ఇటలీ కోర్టులో విచారణ ఆధారంగా హెలికాప్టర్ల స్కాంకు సంబంధిం చి భారత్‌లో ముడుపులు అందినట్లు వెల్లడైన సంగతి తెలిసిందే. దీన్ని కాంగ్రెస్‌పై అస్త్రంగా మార్చుకున్న బీజేపీ.. కుంభకోణంలో కాంగ్రె స్ అధిష్టానంపై విమర్శలు చేస్తోంది.