విమానంలో మూత్రం పోసినందుకు రూ. లక్ష జరిమానా
బాగా తాగేసి.. ఎయిరిండియా విమానంలో సీటు మీద, ఫ్లోర్ మీద మూత్ర విసర్జన చేసిన ఓ ప్రయాణికుడికి దాదాపు లక్ష రూపాయల జరిమానా విధించారు. భారతదేశం నుంచి ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్ వెళ్లేందుకు ఎయిరిండియా విమానం ఎక్కిన జిను అబ్రహం (39) ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. దాంతో ఎయిరిండియా విమాన సిబ్బందితో పాటు తోటి ప్రయాణికులు కూడా తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. తన పదేళ్ల కొడుకుతో కలిసి ప్రయాణిస్తున్నఅబ్రహంకు సంకెళ్లు వేసి, సీట్ బెల్టులతో కుర్చీకి కట్టేశారు. బర్మింగ్‌హామ్‌లో విమానం దిగిన వెంటనే అరెస్టు చేయగా, బర్మింగ్‌హామ్ క్రౌన్ కోర్టు అతడికి 300 పౌండ్ల జరిమానా విధించింది. దాంతోపాటు పరిహారం కింద మరో 500 పౌండ్లు, ఖర్చుల కింద 185 పౌండ్లు, బాధితుల సర్‌చార్జిగా 30 పౌండ్లు చెల్లించాలని తీర్పు చెప్పారు.
అబ్రహం విమానంలో వెళ్తుండగా మద్యం తాగి బాగా ఊగిపోయాడు. సీట్లోకి వెళ్లి కూర్చోమని సిబ్బంది ఎంత కోరినా పట్టించుకోలేదు. ఇక విమానం మరో అరగంటలో ల్యాండ్ అవుతుందనగా ప్యాంటు తీసేసి.. విమానం ఫ్లోర్ మీద, సీటు మీద మూత్ర విసర్జన చేశాడని ప్రాసిక్యూషన్ తరఫు న్యాయవాది జాన్ కార్డిఫ్ తెలిపారు. దాంతో అతడిని ప్లాస్టిక్ సంకెళ్లతో బంధించి, సీటు బెల్టుతో సీటుకు కట్టేశారు. విమానం ల్యాండ్ కాగానే అరెస్టు చేశారు. అయితే.. తాను యాంటీ డిప్రసెంట్ మందులు వాడుతున్నానని, రెండు పెగ్గుల విస్కీ తీసుకున్నానని, ఏం చేశానో తనకు గుర్తులేదని అబ్రహం కోర్టులో చెప్పాడు. కానీ, భారతదేశంలో బయల్దేరే సమయంలో మందుల సంచి కనిపించలేదని, అందుకే మందులు వేసుకోలేకపోయాడని అతడి తరఫు న్యాయవాది అలన్ న్యూపోర్ట్ చెప్పారు. అందువల్ల తన భార్య ఆరోగ్యం గురించి ఆందోళనగా ఉన్నాడన్నారు.