వుహాన్ నుంచి ఢిల్లీ వచ్చిన వారిని ఎయిర్‌పోర్టులోనే పరిశీలిస్తున్న వైద్యులు, ఎయిరిండియా విమానంలో
బీజింగ్/న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో చైనాలోని వుహాన్‌లో ఉన్న 324 మంది భారతీయులను ఎయిరిండియా విమానంలో ప్రభుత్వం స్వదేశానికి తీసుకువచ్చింది. వీరిలో 211 మంది విద్యార్థులు సహా మొత్తం 324 మంది ఉన్నారు. ఆరుగురు విద్యార్థులు తీవ్ర జ్వరంతో బాధపడుతుండటంతో వారిని విమానంలో ఎక్కేందుకు చైనా అధికారులు అనుమతి నిరాకరించారు. ఢిల్లీ చేరుకున్న వారికి ముందుగా ఎయిర్‌పోర్టులోనే స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించారు. వీరిలో 104 మందిని ఐటీబీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 600 పడకల ఆస్పత్రికి రెండో స్క్రీనింగ్ కోసం తరలించారు. ఇలాంటిదే మరో ఆస్పత్రిని మనేసర్‌లో సైన్యం ఆధ్వర్యంలో ఏర్పాటయిందని అధికారులు చెప్పారు.
వుహాన్‌కు మరో విమానం
ఢిల్లీ నుంచి శనివారం మధ్యాహ్నం మరో విమానం సిబ్బంది, వైద్య నిపుణులతోపాటు వుహాన్‌కు బయలుదేరింది. వుహాన్ నుంచి వచ్చిన మొదటి విమానంలో ఉన్న వైద్య బృందాన్నే కెప్టెన్ అమితాబ్ సింగ్ నేతృత్వంలో రెండో విమానంలో పంపించినట్లు ఎయిరిండియా ఎండీ అశ్వినీ లోహానీ తెలిపారు. ఈ విమానంలోని సిబ్బంది ప్రయాణికులతో మాట్లాడటం, వారికి ఆహారం అందించడం వంటి సేవలు కూడా చేయలేదని ఆయన తెలిపారు. అందరికీ మాస్కులు అందించి, పూర్తి జాగ్రత్తలు తీసుకున్నామన్నారు.
పెరుగుతున్న మృతులు
ప్రాణాంతక కరోనా వైరస్‌తో మృతుల సంఖ్య ఒకవైపు పెరుగుతుండగా అదే స్థాయిలో బాధితుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇప్పటి వరకు 259 మంది ఈ వైరస్‌తో మృతి చెందినట్లు ప్రకటించిన చైనా, మరో 12వేల మందికి వ్యాధి సోకినట్లు తెలిపింది. దాదాపు 1,795 మంది రోగుల పరిస్థితి విషమంగా ఉందని, మరో 17,988 మందికి వైరస్ సోకినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ శనివారం పేర్కొంది. వుహాన్ నగరంలోని 75వేల మందికి పైగా కరోనా బారిన పడి ఉంటారని హాంకాంగ్ నిపుణులు అంచనా వేశారని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపింది. ఇప్పటివరకు భారత్ సహా అమెరికా, రష్యా, బ్రిటన్, స్వీడన్ తదితర 25 దేశాల్లో 124 కేసులు బయటపడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment