
'25 వేల మంది ఐసిస్ ఉగ్రవాదులు హతం'
గత 20 నెలలుగా బ్రిటన్, దాని మిత్ర దేశాల వైమానిక దాడుల్లో 25 వేల మందికి పైగా ఐసిస్ ఉగ్రవాదులు హతమైనట్లు బ్రిటన్ రాయల్ ఎయిర్‌ఫోర్స్(ఆర్‌ఎఎఫ్) కల్నల్ వారెన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
లండన్: గత 20 నెలలుగా బ్రిటన్, దాని మిత్ర దేశాల వైమానిక దాడుల్లో 25 వేల మందికి పైగా ఐసిస్ ఉగ్రవాదులు హతమైనట్లు బ్రిటన్ రాయల్ ఎయిర్‌ఫోర్స్(ఆర్‌ఎఎఫ్) కల్నల్ వారెన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. వరుస దాడులతో ఐసిస్ కు కోలుకోని ఎదురుదెబ్బ తగిలిందన్నారు. సిరియా, ఇరాక్‌లోని ఐఎస్ ఆధీన ప్రాంతాల్లో జిహాదీ ఉగ్రవాదుల సంఖ్య సగానికి తగ్గిందన్నారు. గత మూడు వారాల్లోనే 600 మంది ఉగ్రవాదులు మరణించారన్నారు. ఉత్తర ఇరాక్‌లోని దాదాపు ప్రస్తుతం 30 వేల మంది కంటే తక్కువే ఉన్నారు.
తాము చేసిన దాడుల్లో ఐసిస్ చమురు క్షేత్రాలు కూడా ధ్వంసమయ్యాయని తెలిపారు. గత కొన్ని నెలలుగా అమెరికా, సంకీర్ణ సేనలు జరుపుతున్న దాడులతో ఐసిస్ బలహీన పడిందన్నారు. ఒమర్ ఆల్-షిషానీ, జిహాది జాన్ సహా 100 మందిపైగా ఐసిస్ నేతలను మట్టుబెట్టినట్టు వారెన్ వెల్లడించారు.