‘మా అత్త చనిపోయింది.. విమానం దిగం’
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను విమర్శించిన ఓ మహిళను అర్థాంతరంగా విమానంలో నుంచి దింపేశారు. ఆమె విమానంలో ఉంటే కచ్చితంగా గొడవలు జరుగుతాయని భావించిన సిబ్బంది ఆమెను విమానంలో నుంచి పంపించేశారు. అలస్కా ఎయిర్‌లైన్స్ విమానంలో ప్రయాణించాల్సిన ఆమె అనూహ్యంగా తన భర్తతో కలిసి విమానం దిగాల్సి వచ్చింది. ఈ మొత్తం తతంగాన్ని స్కాట్ కోటెస్కీ వీడియోతీసి ఫేస్‌బుక్‌లో పెట్టగా అది పెద్ద వైరల్ అయింది.
ఓ మహిళ పక్కనే కూర్చున్న ట్రంప్ మద్దతుదారుతో ఆమె మాట్లాడుతూ ట్రంప్‌ను ఉద్దేశిస్తూ తిట్టింది. అతడికి ఎలాంటి నమ్మకాలు లేవని, అలాంటి వ్యక్తికి మద్దతు ఎలా అనే భావనలో కాస్తంత వాదులాడింది. దీంతో విమాన సిబ్బంది వచ్చి ఆమె విమానం దిగాలని చెప్పారు. అయితే, అందుకు అస్సలు కుదరదని, తన సీటుకోసం డబ్బు చెల్లించానని, పక్కన ఉన్న వ్యక్తి తన భర్త అని చెప్పింది. తన అత్తగారు చనిపోయిందని, అందుకోసమే వెళుతున్నామని, తన భర్త తల్లిని కోల్పోయిన బాధలో ఉన్నాడని ఆయనను కాస్తంత గౌరవించాలని కోరింది. ఎట్టి పరిస్థితుల్లో దిగే సమస్యే లేదని తెలిపింది. దీంతో పోలీసు సిబ్బంది వచ్చి వారిని విమానం దింపేశారు.