రోబో జర్నలిస్టు వచ్చేశాడు
బీజింగ్: శాస్త్ర, సాంకేతిక రంగాల్లోనేకాదు పాత్రికేయరంగంలోకి రోబో వచ్చేశాడు. చైనాలో రోబో రాసిన 300 పదాల కథనమొకటి ఓ దినపత్రికలో ప్రచురితమైందని బుధవారం పరిశోధకులు తెలిపారు. ఈ వ్యాసం రాసిన రోబో పేరు జియానో నాన్ అని, అది కేవలం సెకన్‌లోనే దీన్ని రాసేసిందని పరిశోధన బృందం వెల్లడించింది. ఈ రోబో చిన్న కథనాలు, పెద్ద వార్తలూ రాయగలదట.
స్టాఫ్ రిపోర్టర్లతో పోల్చితే దీనికి మెరుగైన సమాచార విశ్లేషణ సామర్థ్యం ఉందని, వేగంగా కథనాలు రాయగలదని బృందం పేర్కొంది. ప్రస్తుతం రోబోలు ముఖాముఖి ఇంటర్వూ్యలు నిర్వహించలేవని, సమయస్ఫూర్తితో ప్రశ్నలు సంధించలేవని బృందం పేర్కొంది. అయితే మీడియాలో కీలకమైన ఎడిటర్లు, రిపోర్టర్లకు సహాయకారులుగా మాత్రం ఉపయోగపడగలవని పేర్కొంది.