
లిబియాలో బాంబు దాడి; 50 మంది మృతి
ట్రిపోలి: సంక్షుభిత లిబియాలో మారణహోమం కొనసాగుతూనే వుంది. పశ్చిమ లిబియాలోని జ్లిటెన్ నగరంలో జరిగిన బాంబు దాడిలో కనీసం 50 మంది మృతి చెందినట్టు వార్తలు వస్తున్నాయి. అల్- జహఫాల్ పోలీసు ట్రైనింగ్ సెంటర్ ను లక్ష్యంగా చేసుకుని ఈ బాంబు దాడి జరిగింది. ట్రక్కులో నింపిన బాంబులతో ఈ దాడికి పాల్పడ్డారు.
పేలుడు శబ్ధం దాదాపు 60 కిలోమీటర్ల వరకు వినబడిందని వార్తా సంస్థలు వెల్లడించాయి. ఆత్మాహుతి దాడి జరిగిందని లిబియాలోని ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ప్రతినిధి మార్టిన్ కొబ్లర్ తెలిపారు. గాయపడిన వారిని ట్రిపోలి, మిశ్రతా ఆస్పత్రులకు తరలించినట్టు లిబియా ప్రసారమాధ్యమాలు తెలిపాయి. గడాఫీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అల్- జహఫాల్ పోలీసు ట్రైనింగ్ సెంటర్ మిలటరీ బేస్ గా కొనసాగింది.