73 మంది సజీవదహనం
అఫ్గాన్‌లో రెండు బస్సులు, ఆయిల్ ట్యాంకర్ ఢీ
ఘజ్ని: అఫ్గానిస్తాన్‌లోని కాబూల్-కాందహార్ జాతీయ రహదారి ఆదివారం మరుభూమిని తలపించింది. ఘజ్ని రాష్ట్రంలో ఉదయం 7 గంటలకు జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 73 మంది సజీవదహనమయ్యారు. వెనకెనుక వస్తోన్న రెండు బస్సుల్ని, ఆయిల్ ట్యాంకర్ ఢీకొనడంతో మంటలు చెలరేగి ఈ దుర్ఘటన సంభవించింది. మహిళలు, పిల్లలు సహా పలువురు గుర్తుపట్టలేనంతగా కాలిపోయారు. హృదయ విదారక దృశ్యాలు చూపరుల్ని కన్నీళ్లు పెట్టించాయి. ఆస్పత్రుల్లో పదుల సంఖ్యలో ప్రయాణికులు తీవ్ర గాయాలతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఆఫ్గానిస్తాన్ చరిత్రలోని జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాల్లో ఇదొకటని భావిస్తున్నారు.
మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోందని, ఎక్కువ మంది తీవ్రంగా కాలిపోయారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయేల్ కవూసీ తెలిపారు. మృతులు ఇంకా పెరగవచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గాయాలతో బయటపడ్డవారికి కాందహార్, ఘజ్ని ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.
అంతర్యుద్ధంతో ఘోరంగా దెబ్బతిన్న రోడ్డు.. 125 మంది ప్రయాణికులతో రెండు బస్సులు కాబూల్ నుంచి కాందహార్‌కు వెళ్తున్నాయి. ఇదే సమయంలో ఎదురుగా వస్తోన్న ఆయిల్ ట్యాంకర్ ఒక బస్సును ఢీకొనడంతో వెనక బస్సుకు కూడా మంటలు అంటుకున్నాయి. 52 మంది సంఘటనా స్థలంలో విగతజీవులవగా, 21 మంది తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మృతిచెందారు. నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగిందని ట్రాఫిక్ విభాగ అధికారులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బందితో పాటు స్థానికులు కూడా సహాయ కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. అంతర్యుద్ధం దెబ్బకు అఫ్గాన్‌లో రోడ్లు కూడా దారుణంగా పాడైపోయాయి. గతేడాది మేలో బడ్గిస రాష్ట్రంలో మినీ వేన్ బోల్తా పడి 18 మంది మరణించారు. 2013లో కాందహార్ దక్షిణ ప్రాంతంలో బస్సును ఆయిల్ ట్యాంకర్ ఢీకొనడంతో 45 మంది మృతిచెందారు. దీంతో అఫ్గాన్‌లో రోడ్ల అభివృద్ధికి గతేడాది నవంబర్‌లో రూ. 1675 కోట్ల సాయం ఇచ్చేందుకు ప్రపంచబ్యాంకు అంగీకరించింది.