సిడ్నీ : ఆస్ట్రేలియాలో సంచలనం సృష్టించిన వివాహిత అదృశ్యం కేసులో ముప్పై ఆరేళ్ల తర్వాత పోలీసులు ఆమె భర్తను అరెస్టు చేశారు. వివాహేతర సంబంధం ఉన్న కారణంగానే ఆమెను హత్య చేసినట్లు భావిస్తున్నామని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి జరిగిన జాప్యానికి క్షమాపణ కోరుతూ న్యూసౌత్ వేల్స్ పోలీస్ కమిషనర్ మిక్ ఫుల్లర్ ప్రకటన విడుదల చేశారు.
వివరాలు... క్రిస్ డాసన్, లినెట్టి అనే దంపతులు సిడ్నీలో జీవించేవారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో 1982లో అకస్మాత్తుగా లినెట్టి కనిపించకుండా పోయింది. ఈ విషయమై ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందులో భాగంగా క్రిస్‌ను విచారించగా.. లినెట్టి అదృశ్యంతో తనకు సంబంధం లేదని, మత ప్రచార సంస్థతో కలిసి ఆమె వెళ్లిపోయిందని అతడు చెప్పినట్లు వార్తలు ప్రచురితమయ్యాయి. అయితే ఇంతవరకు లినెట్టి జాడ తెలియక పోవడంతో పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో 70 ఏళ్ల క్రిస్‌ను పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు.
విద్యార్థినితో సంబంధం.. వివాహం
స్కూలు టీచరుగా పనిచేసే సమయంలో తన విద్యార్థినులతో క్రిస్‌కు వివాహేతర సంబంధాలు ఉండేవనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా లినెట్టి కనిపించకుండా పోయిన కొద్ది కాలానికే తన స్టూడెంట్‌ను క్రిస్ పెళ్లాడాడు. ఈ నేపథ్యంలో అక్రమ సంబంధాలు, రెండో పెళ్లికి అడ్డుగా ఉందన్న కారణంగానే క్రిస్.. లినెట్టిని చంపి ఉంటాడని పోలీసులు భావించారు. కానీ ఇందుకు సంబంధించిన పక్కా ఆధారాలను సేకరించలేకపోయారు. దీంతో అప్పటి నుంచి ఈ కేసు పోలీసులకు సవాలుగా మారింది. అయితే లినెట్టి అదృశ్యానికి సంబంధించిన వార్తలు పోడ్‌క్యాస్ట్‌ల రూపంలో వైరల్‌గా మారడంతో.. ‘ద టీచర్స్ పెట్’ గా క్రిస్ స్టోరీ ప్రాచుర్యం పొందింది. దీంతో పోలీసులపై మరింత ఒత్తిడి పెరిగింది.
ఈ క్రమంలో 2018లో కేసును తిరిగదోడిన పోలీసులు మరోసారి క్రిస్ ఇంటిని సోదా చేశారు. అయితే ఇప్పుడు కూడా లినెట్టి అదృశ్యానికి సంబంధించిన ఆధారాలేవీ దొరకలేదు గానీ, తమ డిటెక్టివ్ బృందం ఆ పనిలో నిమగ్నమైందని పోలీసులు తెలిపారు. కాగా ఈ విషయమై లినెట్టి సోదరుడు మాట్లాడుతూ.. ఇప్పటికైనా తన సోదరికి న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment