ట్రంప్ ఆస్ట్రేలియన్లను కూడా చీల్చాడు!
కాన్‌బెర్రా: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తనకు మాత్రమే కాదు.. తన గురించి చర్చించుకుంటున్నవారికి తలనొప్పిగా మారారు. ట్రంప్ ఇటీవల తీసుకొచ్చిన ఏడు ముస్లిం దేశాల పౌరుల ట్రావెలింగ్ బ్యాన్ విషయంలో ఆస్ట్రేలియా వాసులు రెండుగా చీలిపోయారు. ట్రంప్‌దే కరెక్ట్ అని సగం మంది, సరికాదని మిగితా సగంమంది తగువుకు దిగారు. ఈ విషయం అక్కడ నిర్వహించిన ఓ ఆన్‌లైన్ సంస్థ తెలిపింది. 44శాతంమంది ఆస్ట్రేలియన్లు ట్రంప్ నిర్ణయానికి అనుకూలంగా నిలవగా 45 శాతం మంది మాత్రం వ్యతిరేకంగా నిల్చున్నారు.
కన్జర్వేటివ్ ఓటర్లంతా కూడా ట్రంప్ శైలి తమకు నచ్చిందని, దానిని ప్రవేశపెడితే ఆస్ట్రేలియాలోకి కూడా వలసలు రాకుండా అడ్డుకోవచ్చని చెబుతున్నారంట. అలాగే, నేషనల్, లిబర్ ఓటర్లు కూడా ట్రంప్ విధానాన్ని సమర్థిస్తున్నారని కూడా ఆ సంస్థ తెలిపింది. ఇక 34శాతం ఓటర్లు ట్రంప్ కు అనుకూలంగా ఉన్నారని, అదే సమయంలో 55శాతం మంది మాత్రం ట్రంప్ విధానంపై గుర్రుగా ఉన్నారని ఆ సంస్థ తెలిపింది. జర్మనీ, బ్రిటన్, కెనడా వంటి దేశాలు స్పష్టంగా ట్రంప్ విధానాన్ని తప్పుబట్టగా అమెరికా వ్యక్తిగత అంశాల్లో తాము జోక్యం చేసుకోమని, అది ఆ దేశం ఇష్టమంటూ ఆస్ట్రేలియా ప్రధాని మాల్కోమ్ టర్న్‌బుల్ స్పష్టతనివ్వకుండా సమాధానం దాటవేశారు.