28 ఏళ్ళ తర్వాత అక్కడో శిశువు పుట్టింది..!
ఆ ప్రాంతంలో పిల్లలు పుట్టడమే కరువై... సంవత్సరాలు దాటి పోయింది. నవజాత శిశువులకోసం పరితపించే అక్కడి ప్రజలకు.. దశాబ్దాల తర్వాత అద్భుతం జరిగింది. ఏళ్ళుగా వారు కంటున్న స్వప్నం... వారం క్రితం సాకారమైంది.
ఇటలీలోని ఓస్థానా పట్టణంలో 1987 తర్వాత ఏ కుటుంబంలోనూ పిల్లలు పుట్టడమే చూడలేదని, స్థానిక మేయర్ లాంబార్డో చెప్తున్నారు. గతవారం ఓ కుటుంబంలో శిశువు జన్మించడం నిజంగా అద్భుత సన్నివేశమని... దీంతో అక్కడి ప్రజలు ఆనందంలో తేలియాడుతున్నారని ఇటలీ డైలీ న్యూస్ పేపర్ లా స్టాంపా వెల్లడించింది. ఓస్థానాలో పుట్టిన చిన్నారితోపాటు... కేవలం 85 మంది మాత్రమే ఇక్కడ నివసిస్తున్నారు. ఇతర గ్రామాలు, పట్టణాలతో పోలిస్తే ఇక్కడి జనాభా క్రమంగా తగ్గిపోతోంది. ఇక్కడ ఇటువంటి పరిస్థితి నిజానికి 1975 లో ప్రారంభమై...1976-87 కు మధ్య కేవలం 17 మంది పిల్లలు మాత్రమే పుట్టడం చరిత్రను సృష్టించింది. అప్పట్లో చివరిగా ఓ అబ్బాయి పుట్టినట్లు స్థానిక మేయర్ జియాకోమో లాంబార్డో చెప్తున్నారు. జననాల ట్రెండ్ తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో... ఈ పరిస్థితి కొనసాగాలని కోరుకుంటూ స్థానికంగా ప్రత్యేక వేడుకను కూడా నిర్వహించారు.
జనాభా తగ్గిపోవడాన్ని అరికట్టడం ఎంతో కష్టమని, ఆ దిశగా తాము ఎన్నో ఆలోచనలు చేస్తున్నామని లాంబార్డో అంటున్నారు. ముఖ్యంగా యువ ఇటాలియన్లకు ఈ గ్రామీణ ప్రాంతంలో ఉద్యోగావకాశాలు లేకపోవడం కూడా ఇక్కడ జనాభా తగ్గడానికి కారణమని ఆయన అంటున్నారు. ఉద్యోగాలకోసం ఇక్కడి ప్రజలు అనేకమంది స్వంత ఇళ్ళను కూడా వదిలి నగరాలకు వెళ్ళిపోయారని చెప్తున్నారు. ఇటలీలోని ఈ ఓస్థానా పట్టణంలో ప్రస్తుతం ఓ దుకాణం, ఓ బార్, రెండు రెస్టారెంట్లు మాత్రమే ఉన్నట్లు స్థానిక వార్తా వెబ్ సైట్ 'ది లోకల్' ప్రకారం తెలుస్తోంది. ఉత్తర ఇటలీలో కొంత శాతం మెరుగ్గా ఉన్నప్పటికీ, దక్షిణ ఇటలీలోని సిసిలీ సహా అన్ని ప్రాంతాలూ తీవ్రమైన భౌగోళిక మార్పులను ఎదుర్కొంటోంది. ఇటువంటి పరిస్థితులపై తీవ్ర ఆందోళనకు గురైన కొందరు స్థానికులు... ఇక్కడి జనాభా పెరుగుదల కోసం ప్రత్యేక చర్యలు ప్రారంభించారు. అందులో భాగంగా వైద్యపరీక్షలు చేయించుకొని, మరణాలు తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు.
సిసిలీ ద్వీపంలోని గంగి పట్టణంలో గతేడాది మరో ప్రయత్నం కూడా చేశారు. ఇక్కడి సుమారు 20 గృహాలు రెండు డాలర్లకన్నా అతి తక్కువ ధరకు అమ్మకానికి పెట్టారు. ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు సుమారు 50 మంది ముందుకొచ్చారు. వీరు తిరిగి వెళ్ళకుండా ఉండేందుకు కొనుగోలుదారుల ఇష్టప్రకారం పునరుద్ధరణకు కూడా అంగీకరించారు. దీంతో ప్రస్తుతం గంగిలో 7 వేల మంది నివాసితులు ఉన్నారు. అయినప్పటికీ ఓస్థానాలో పరిస్థితే ఇక్కడ కూడా ఏర్పడుతుందేమోనని స్థానిక నాయకులు ఆందోళన చెందుతున్నారు.
ప్రస్తుతం ఓస్థానాలో జన్మించిన శిశువు పాబ్లో రాకను తాము స్వాగతిస్తున్నామని, ఇక్కడ తిరిగి పుట్టుక ప్రారంభమవ్వడం గర్వించదగ్గ మార్పు అని మేయర్ లాంబార్డో అంటున్నారు. స్థానిక యువకులు పట్టణం వదిలి ఉద్యోగాలకోసం వలస వెళ్ళకుండా ఆపే తమ ప్రయత్నం క్రమంగా ఫలిస్తోందని, తల్లిదండ్రులు కొన్నేళ్ళక్రితం ఉపాధికోసం ఊరు వదిలి వెళ్ళినా.. ప్రస్తుతం ఇక్కడ ఉద్యోగావకాశం కల్పించడంతో తిరిగి బస చేసేందుకు యువకులు వస్తున్నారని లాంబార్డో చెప్తున్నారు. తమ ప్రయత్నాలతో క్రమంగా జనాభా కూడా అభివృద్ధి చెందే అవకాశం కనిపిస్తున్నట్లు ఆయన అంటున్నారు.