పుట్టకముందే బిడ్డను చూసుకోవచ్చు!
లండన్: 2డీ, 3డీ, 4డీ అల్ట్రాసౌండ్ స్కానింగ్‌లో ప్రసిద్ధి చెందిన లాంక్ షైర్‌లోని ‘బేబీ బూ’ ఆస్పత్రి వినూత్న సర్వీసులను అందిస్తోంది. పుట్టబోయే బిడ్డ ఎలా ఉంటుందో అచ్చం అలాంటి ప్రతిమను సృష్టించి తల్లుల చేతుల్లో పెడుతోంది. పుట్టబోయే బిడ్డను ముందే చూసుకొని మురిసిపోవచ్చని చెబుతోంది. ఓ తల్లి గర్భంలో పిండం పూర్తిస్థాయి శిశువుగా మారేందుకు దాదాపు 28 వారాలు పడుతుందని, అప్పుడు తన వద్దకు వచ్చే తల్లులకు స్కానింగ్ చేసి... 3డీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పుట్టబోయే బిడ్డ ప్రతిమను రూపొందిస్తామని ఆ ఆస్పత్రి యజమాని కేటీ కెర్మోడ్ తెలియజేశారు.
పుట్టిన తర్వాత బిడ్డకు, తాము ముందే రూపొందించిన ప్రతిమకు ముఖ కవలికల్లో ఏ మాత్రం తేడా ఉండదని కేటీ చెప్పారు. బిడ్డ ప్రతిమను అందంగా అలంకరించిన బాక్సులో లేదా గోడకు వేలాడదీసుకునేందుకు వీలుగా ఫొటోఫ్రేమ్‌లో, ఎలా కోరుకుంటే అలా అందజేస్తామని ఆమె వివరించారు. స్కానింగ్ చార్జీలు కాకుండా బిడ్డ ప్రతిమకు దాదాపు 15వేల రూపాయలు ఖర్చవుతుందని చెప్పారు. ప్రస్తుతానికి తాము తల, మెడ వరకున్న ప్రతిమలను మాత్రమే తయారు చేసి ఇస్తున్నామని, మొత్తం బాడీ అంతా కావాలనుకుంటే తల్లులు 16వ వారంలో ఒకసారి, మళ్లీ 28వ వారంలో ఒకసారి తమ ఆస్పత్రికి రావాల్సి ఉంటుందని చెప్పారు.
తనకు రెండు సార్లు గర్భస్రావం జరగడంతో ఈ వినూత్న ప్రతిమ ఆలోచన వచ్చిందని, ఈ రకమైన సర్వీసును తమ ఆస్పత్రి అందిస్తుందని ప్రకటించినప్పుడు తొలుత తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, ఇప్పుడు మాత్రం ఇలాంటి ప్రతిమలకు డిమాండ్ పెరుగుతోందని కేటీ తెలిపారు. ఆస్పత్రిలో మొట్టమొదటి సారిగా బిడ్డ ప్రతిమను తయారు చేయించుకున్న 28 ఏళ్ల లేలా మ్యాక్‌మిలన్ మాత్రం ఇది అద్భుతమైన ప్రక్రియని ఆనందపడిపోతున్నారు. స్కానింగ్ ఇమేజ్‌లు, వాటికి సంబంధించిన డీవీడీ కలిగి ఉండడం కన్నా బిడ్డ ముఖాన్ని ప్రతిమలో చూసుకోవడం థ్రిల్లింగా ఉందని వృత్తిరీత్య ఫొటోగ్రాఫరైన మ్యాక్‌మిలన్ చెప్పారు.