ఒకడు తలనరికాడు.. మరొకడు పిస్టల్‌తో కాల్చాడు!
ఢాకా: ఇస్లామిక్ ఛాందసవాదానికి వ్యతిరేకంగా ఫేస్‌బుక్‌లో తరచూ పోస్టులు పెడుతున్న ఓ లా విద్యార్థిని బంగ్లాదేశ్‌లో అత్యంత కిరాతకంగా హతమార్చారు. బంగ్లాదేశ్‌లో వరుసగా జరుగుతున్న సెక్యులర్ కార్యకర్తలు, బ్లాగర్స్ హత్యల పరంపరలో తాజా ఘటన ఒకటి కావడం దుమారం రేపుతున్నది.
'నజిముద్దీన్ సమద్‌పై బుధవారం రాత్రి నలుగురు దుండగులు దాడి చేశారు. వారిలో ఒకడు కత్తితో అతని తల నరికేయగా, మరొకడు పిస్టల్‌తో అతి సమీపం నుంచి కాల్చాడు. దీంతో సంఘటన స్థలంలోనే సమద్ ప్రాణాలు విడిచాడు' అని ఢాకా మెటోపాలిటన్ డీసీపీ సయెద్ నురుల్ ఇస్లాం తెలిపారు. ఇది ఉద్దేశపూరితంగా చేసిన హత్యగానే భావిస్తున్నా.. దీనిపై ఎవరూ ఇంతవరకు బాధ్యత ప్రకటించుకోలేదని తెలిపారు. అతని రాతలను వ్యతిరేకిస్తూ ఈ హత్య చేశారా? అన్నది పోలీసులు విచారిస్తున్నట్టు తెలిపారు.
ఈశాన్య నగరమైన సిల్హెట్ నుంచి ఇటీవల ఢాకా వచ్చిన సమద్.. ఇక్కడి జగన్నాథ యూనివర్సిటీలో అతను న్యాయశాస్త్రాన్ని అభ్యసిస్తున్నాడు. వర్సిటీ సమీపంలో రద్దీ రోడ్డుపై సమద్‌ను దారుణంగా హతమార్చారని, ఈ సమయంలో దుండగులు 'అల్లాహు అక్బర్' అని నినదించారని ఢాకా ట్రిబ్యున్ పత్రిక తెలిపింది. సమద్ ఢాకా రాకముందు నుంచే అతని రాతలపై దుండగులు నిఘా పెట్టి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
బంగ్లాదేశ్‌లో ఇటీవల హేతువాదుల హత్యలు బాగా పెరిగాయి. 2013 ఫిబ్రవరి 5న రాజిబ్ హైదర్ అనే సెక్యులర్ బ్లాగర్‌ను ఆయన ఇంటికి సమీపంలోనే దారుణంగా హతమార్చారు. 2015లో మరో నలుగురు బ్లాగర్లు అవిజిత్ రాయ్, వశీకర్ రహ్మన్ బాబు, అనంత బిజోయ్, నీలోయ్ ఛటర్జీలను అతి కిరాతకంగా చంపారు.