ఢాకా : గన్‌తో కాక్‌పిట్‌లోకి ప్రవేశించి.. విమనాన్ని హై జాక్ చేసేందుకే ప్రయత్నించిన వ్యక్తిపై కాల్పులు జరిపి ప్రయాణికులను రక్షించారు భద్రతాసిబ్బంది. బంగ్లాదేశ్‌లో ఆదివారం జరిగింది ఈ సంఘటన. వివరాలు.. 148 మంది ప్రయాణికులతో ఢాకా నుంచి దుబాయ్ వెళ్తున్న బిమాన్ బంగ్లాదేశ్ ఎయిర్‌లైన్ విమానాన్ని మార్గమధ్యంలో దారి మళ్లించేందుకు ప్రయత్నించాడు హైజాకర్. ఛత్రోగ్రామ్ విమానాశ్రయం నుంచి విమానం బయల్దేరిన కాసేపటికే ప్రయాణికుల్లోని ఓ వ్యక్తి తన వద్ద గన్, పేలుడు పదార్థాలు ఉన్నాయని బెదిరిస్తూ కాక్‌పిట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. భార్యతో తనకు గొడవలున్నాయని, ఈ విషయమై బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో తనను వెంటనే మాట్లాడించాలంటూ నిందితుడు విమాన సిబ్బందిని డిమాండ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
దీంతో అప్రమత్తమైన పైలట్లు వెంటనే విమానాన్ని ఛత్రోగ్రామ్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అనంతరం ఉన్నతాధికారులు హైజాకర్‌తో చర్చలు జరిపి.. ప్రయాణికులను విమానం నుంచి దింపేయాలని అడగగా అందుకు హైజాకర్ ఒప్పుకున్నాడు. దాంతో వారిని అత్యవసర ద్వారం గుండా బయటకు తీసుకొచ్చారు. అనంతరం కమాండోలు రంగ ప్రవేశం చేసి లొంగిపోవాలని హైజాకర్‌ను హెచ్చరించారు. కానీ అతడు నిరాకరించడంతో కాల్పలు జరిపి అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన హైజాకర్ ప్రాణాలు కోల్పోయాడు. నిందితుడిని బంగ్లాదేశ్‌కు చెందిన మహదిగా గుర్తించారు అధికారులు.
ఈ విషయం గురించి దర్యాప్తు చేసిన అధికారులు ఈ ఘటన వెనుక ఎలాంటి ఉగ్రకోణం లేదని, కేవలం వ్యక్తిగత కారణాలతోనే నిందితుడు విమానాన్ని హైజాక్ చేసేందుకు ప్రయత్నించినట్లు వెల్లడించారు. భార్యతో మనస్పర్థల కారణంగానే సదరు వ్యక్తి ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోందని అధికారులు తెలిపారు. అయితే అతడి వద్దకు పేలుడు పదార్థాలు ఎలా వచ్చాయి.. వాటిని విమానంలోకి ఎలా తీసుకొచ్చాడన్నది మాత్రం తెలియరాలేదని తెలిపారు. నిందితుడు మానసిక స్థితి సరిగ్గా లేదని చర్చల సమయంలో తాము గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment