న్యూఢిల్లీ: చుట్టూ ఆవహించిన సముద్ర తరంగాల మీదుగా చల్లటి గాలులు వీస్తుంటే అందమైన దీవిపై వెలిసిన సువిశాల సుందర భవనంలో శాశ్వత నివాసం ఏర్పరుచుకొని, శేష జీవితం గడపాలనుకుంటే అది అందరికి స్వప్నం అవుతుందేమోగానీ అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులకు మాత్రం సాకారమవుతుంది. అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రంలోని మార్తాస్ వినియార్డ్ దీవిపై 29 ఎకరాల విస్తీర్ణ ప్రాంగణంలో 6,900 చదరపు అడుగుల్లో నిర్మించిన సువిశాల సుందర భవనాన్ని ఒబామా దంపతులు కొనుగోలు చేశారు. ఏడు పడక గదులు, తొమ్మిది బాత్ రూమ్‌లు, రెండు అతిథుల చావడీలు, అధునాతన కిచెన్ కలిగిన ఈ భవనాన్ని 11.75 మిలియన్ల డాలర్ల(దాదాపు 85 కోట్ల రూపాయలు)కు ఒబామా దంపతులు కొనుగోలు చేశారు. ‘బోస్టన్ సెల్‌టిక్స్ (అమెరికా ఫ్రొఫెషనల్ ఫుట్‌బాల్ జట్టు)’ యజమాని విక్ గ్రౌస్‌బెక్ గత వేసవి కాలంలోనే అమ్మకానికి పెట్టగా ఒబామా వేసవి దంపతులు వేసవి విడిదిగా ఆ సుందర భవనంలో దిగారు. ఆ మైదానంలో ఒబామా తన మిత్రులతో గోల్ఫ్ కూడా ఆడుతూ వచ్చారు. చివరకు ఆ భవనాన్ని కొనుగోలు చేయాలని ఒబామ దంపతులు ధరను ఖరారు చేసుకున్నట్లు అభిజ్ఞవర్గాల ద్వారా తెల్సింది.
2001లో నిర్మించిన ఆ భవనాన్ని వాస్తవానికి 14.50 మిలియన్ డాలర్లకు యజామని గ్రౌస్‌బెక్ అమ్మకానికి పెట్టగా, ఒబామా గీచి గీచి బేరం పెట్టి యజమానిని ఒప్పించారట. ఆ భవనం ఆవరణలో ఓ స్విమ్మింగ్ పూల్‌తోపాటు అవుట్‌డోర్ ఫైర్ పిట్, సన్‌బాత్ కోసం అద్భుతమైన బాల్కనీ ఉన్నాయి. అన్నింటికంటే ప్రైవేట్ బీచ్, బోట్ హౌజ్ కూడా ఉన్నాయి. అమ్మకానికి ఆ భవనం ప్రాంగణానికి అనుకొని కొన్ని వందల ఎకరాల స్థలం ఉందట. క్రమంగా పక్కనున్న ఎకరాలను కూడా కొనుగోలు చేయవచ్చనే ముందు చూపుతోనే ఒబామా ప్యాలెస్ లాంటి ఆ భవనాన్ని కొనుగోలు చేశారట. మసాచుసెట్స్ నుంచి వినియార్డ్ దీవిపైకి రావాలన్నా, పోవాలన్నా గగన, జల మార్గాలే శరణ్యం. ఆ దీవిపై ప్రైవేటు ప్రాపర్టీ కొనుగోలు చేసిన మొదటి మాజీ దేశాధ్యక్షుడు ఒబామానే అనుకుంటే పొరపాటు జాకీ కెన్నడీకి అక్కడ సొంతిల్లుంది. 1994లో ఆయన చనిపోయే వరకు ఆయన అక్కడే ఉన్నారు. ఆయన వంశానికి చెందిన వారు ఇప్పటికీ అక్కడే ఉంటున్నారు. ఒబామా అదే దీవిపైనున్న తమ సమ్మర్ హోమ్‌ను గతేడాది 15 మిలియన్ డాలర్లకు విక్రయించారు.
Comments
Please login to add a commentAdd a comment