ప్రపంచంలోనే పెద్ద ట్విన్ జెట్.. బోయింగ్ 777 | boeing 777 world largest TWIN jet | Sakshi
Sakshi News home page

ప్రపంచంలోనే పెద్ద ట్విన్ జెట్.. బోయింగ్ 777

Published Fri, Jun 12 2015 11:09 AM | Last Updated on Sun, Sep 3 2017 3:38 AM

ప్రపంచంలోనే పెద్ద ట్విన్ జెట్.. బోయింగ్ 777

ప్రపంచంలోనే పెద్ద ట్విన్ జెట్.. బోయింగ్ 777

మానవుడి మేధస్సుకు అద్దం పట్టే ఆవిష్కరణల్లో విమానం ఒకటి. రైట్ సోదరులు దీనికి రూపకల్పన చేసినప్పటి నుంచి ఇందులో ఎన్నో మార్పులు వచ్చాయి. విమానం వెళ్తున్న చప్పుడు వినగానే ఇంటి బయటకు వచ్చి దాన్ని చూస్తూ కేరింతలు కొట్టని బాల్యం ఉండదంటే
 అతిశయోక్తి కాదు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ ఒక్కసారైనా ఇందులో విహరించాలని కోరిక ఉంటుంది. ప్రపంచాన్నే కుగ్రామంగా మార్చేసిన ఆవిష్కరణల్లో ఇదీ ఒకటి. ప్రపంచంలో అతి పెద్ద విమానంగా ప్రసిద్ధి చెందిన బోయింగ్-777 సేవలు ఈ రోజు నుంచే ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా ఈ భారీ విమానం విశేషాలు మీ కోసం!
             
ప్రత్యేకతలు: బోయింగ్ ఎయిర్‌లైన్స్ ప్రపంచంలోనే అతి పెద్ద ట్విన్‌జెట్ (రెండు ఇంజన్లతో నడిచే) విమానం. దీన్ని సాధారణంగా ‘ట్రిపుల్ సెవెన్’ అని పిలుస్తారు. ఇందులో సుమారు 300 మందికి పైగా ప్రయాణించొచ్చు. దీని వేగం సుమారు గంటకు 10,000 నుంచి 17,000 కి.మీ. ఇది పూర్తిగా కంప్యూటర్‌తో డిజైన్ చేసిన తొలి వాణిజ్య విమానం. భారీ పరిమాణంలో చేసిన టర్బో ఫ్యాన్ ఇంజన్లు, ల్యాండింగ్ గేర్‌పై ఆరు చక్రాలు, ఒక వృత్తాకారపు ఫ్యూజ్‌లేజ్ (సిబ్బంది, ప్రయాణికులుండే ప్రాంతం), బ్లేడ్ ఆకారంలో  చేసిన తోక భాగం.. ఇందులో ప్రత్యేక విశిష్టతలు.
 
తొలిసారిగా: యునెటైడ్ ఎయిర్‌లైన్స్ 1995లో దీన్ని తొలిసారిగా వాణిజ్య సేవలకు వినియోగించింది. 2010 మే నాటికి దీనిలో వివిధ మోడళ్లకు సంబంధించి 59 నిర్వాహక సంస్థలు 1,148 విమానాల కోసం ఆర్డరు చేయగా 864 విమానాలు సరఫరా అయ్యాయి. దీనిలో సాధారణ మోడల్‌లో మొత్తం 413 విమానాలను డెలివరీ చేశారు. ఈ మోడల్ విమానాలు అత్యధికంగా ఎమిరేట్స్ సంస్థ వద్ద 78 ఉన్నాయి.
 
 నేపథ్యం: 1970 ప్రారంభంలో బోయింగ్ 747, మెక్‌డోనెల్ డౌగ్లస్ డీసీ-10, లాకీడ్ ఎల్-1011 ట్రైస్టార్ విమానాల సేవలు ప్రారంభమయ్యి తొలి తరం వైడ్ బాడీ ప్రయాణ విమానాలుగా అవతరించాయి. 1978లో బోయింగ్ సంస్థ మరో మూడు కొత్త మోడళ్లను ఆవిష్కరించింది. వీటిలో ఎయిర్‌బస్ ఎ-300ను సవాలు చేసే రెండు ఇంజన్లు కలిగిన విమానాలతో పోటీ పడే విధంగా తయారు చేసిన ఒక ట్రైజెట్ విమానమే 777 మోడల్.
 
 డిజైన్: బోయింగ్ కొత్త ట్విన్‌జెట్ రూపకల్పన గత వాణిజ్య జెట్ విమానాలకు భిన్నమైంది. తొలిసారిగా ఎనిమిది అతిపెద్ద వైమానిక సంస్థలు ఆల్ నిప్పన్ ఎయిర్‌వేస్, అమెరికన్ ఎయిర్‌లైన్స్, బ్రిటిష్  ఎయిర్‌వేస్, కేథె పసిఫిక్, డెల్టా ఎయిర్‌లైన్స్, జపాన్ ఎయిర్‌లైన్స్, సంతాస్, యునెటైడ్ ఎయిర్‌లైన్స్‌లు.. బోయింగ్ కొత్త ట్విన్‌జెట్ రూపకల్పనలో ప్రధాన పాత్ర పోషించాయి.
 
 ఉత్పత్తి: బోయింగ్ జెట్ విమాన తయారీ కాంట్రాక్ట్ కోసం అంతర్జాతీయ సంస్థలు ఊహించని రీతిలో పోటీపడ్డాయి. వీటిలో మిట్సుబిషి హెవీ ఇండస్ట్రీస్, కవాసాకి హెవీ ఇండస్ట్రీస్, ఫుజి హెవీ ఇండస్ట్రీస్ లిమిటెడ్, హాకర్ డి హావిల్లాండ్, ఎయిరోస్పేస్ టెక్నాలజీస్ ఆఫ్ ఆస్ట్రేలియా వంటి అంతర్జాతీయ సంస్థలున్నాయి.
 
 సేవల ప్రారంభం: తొలి 777 విమానాన్ని 1995 మే 15న బోయింగ్ సంస్థ డెలివరీ చేసింది. 1995 మే 30న ప్రాట్ అండ్ వైట్నీ పీడబ్ల్యూ 4084 ఇంజన్ కలిగిన విమానానికి 180 నిమిషాల ఈటీఓపీ క్లియరెన్స్‌ను ఎఫ్‌ఏఏ ఇచ్చింది. తద్వారా ఈటీఓపీఎస్ 180 రేటింగ్‌తో సేవలు ప్రారంభించిన మొట్టమొదటి విమానంగా గుర్తింపు పొందింది.
 
 పురోగతి: తొలి మోడల్ తర్వాత, బోయింగ్ 777-200ఈఆర్‌ను అభివృద్ధి చేసింది. ఇది విస్తృత శ్రేణి కలిగిన మోడల్. 1996 అక్టోబర్ 7న ట్రైల్ రన్‌ను నిర్వహించారు. 1997 జనవరి 17న జేఏఏ సర్టిఫికెట్‌ను అందుకుంది. 1997 ఫిబ్రవరి 9న బ్రిటిష్ ఎయిర్‌వేస్‌తో సేవలు ప్రారంభించింది. అత్యంత సుదూర ప్రయాణాలు చేసే ఈ మోడల్ 2000 ప్రారంభంలో వైమానిక సంస్థలు అత్యధికంగా ఆర్డర్ చేసిన వెర్షన్‌గా రికార్డుల కెక్కింది.
 
 సాంకేతిక పరిజ్ఞానం: 777 డిజైన్ ద్వారా బోయింగ్ అసంఖ్యాక అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలకు ఆవిష్కరించింది. పూర్తిస్థాయి డిజిటల్ ఫ్లై బై వైర్ నియంత్రణలు, పూర్తి సాఫ్ట్‌వేర్ కాన్ఫిగడబుల్ అవియోనిక్స్, అధునాతన కాక్‌పిట్‌లు వీటిలో ముఖ్యమైంది. రద్దు చేసిన బోయింగ్ 7జే7 మోడల్‌పై జరిపిన పరిశోధనను బోయింగ్ కంపెనీ వినియోగించుకుంది.
 
 రెక్కల నిర్మాణం: 777 రెక్కలు సూపర్ క్రిటికల్ ఎయిర్‌ఫోయిల్ డిజైన్‌ను కలిగి ఉంటాయి. రెక్కలు 31.6 డిగ్రీలతో తయారు చేశారు. మేక్ 0.83 వద్ద ప్రయాణించేందుకు అనుకూలంగా ఉంటాయి. రెక్కలను మరింత మందంగా, అంతకు ముందు విమానాల కంటే సుదీర్ఘ వెడల్పుగానూ రూపొందించారు. ఫలితంగా రవాణా సామర్థ్యం, దూరం, టేకాఫ్ సామర్థ్యాలు పెరిగాయి.
 
 ప్రమాదాలు:
 2010 మే నాటికి బోయింగ్-777 మొత్తం ఏడు ప్రమాదాలకు గురైంది. అందులో ఒకటి వైమానిక ప్రమాదం. అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. 2001 సెప్టెంబర్ 5న డెన్వర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వద్ద ఇంధనం తిరగ పోసుకునేటప్పుడు ఒక ట్విన్ జెట్ అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఒక కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. బ్రిటిష్ ఎయిర్‌వేస్‌కు చెందిన ఈ విమానం రెక్కలు కాలిపోయాయి. తర్వాత దీన్ని బాగుచేసి తిరిగి సేవలకు వినియోగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement