
దాడుల భయంతో న్యూ ఇయర్ వేడుకలకు దూరం
బ్రస్సెల్స్: ఉగ్రదాడుల భయాందోళనతో నూతన సంవత్సర వేడుకలకు బెల్జియం దూరంగా ఉంటుంది. ఈ విషయాన్ని బ్రస్సెల్స్ లోని ప్రభుత్వ అధికారులు ప్రకటించారు. న్యూ ఇయర్ వేడుకలు నిర్వహిస్తుంటే ఉగ్రవాద దాడులు జరిగే అవకాశం ఉన్నందున తాము అ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. బెల్జియం అంతర్గత వ్యవహారాలశాఖ మంత్రి, కొంత మంది అధికారులతో కలిసి సమావేశమైన అనంతరం ఈ నిర్ణయంపై స్పష్టత వచ్చిందని ఓ ఉన్నతాధికారి స్థానిక మీడియాకి వెల్లడించారు. అధికారికంగా ఈ వేడుకలు నిర్వహించనప్పటికీ, ప్రజలు మాత్రం సెలబ్రేట్ చేసుకునే అవకాశం కల్పించామన్నారు.
గురువారం రాత్రి న్యూ ఇయర్ వేడుకలు రద్దు చేస్తున్నట్లు బ్రస్సెల్స్ మేయర్ వైవన్ మయేర్ తెలిపారు. నగరంలో ఇప్పటికీ పండుగ వాతావరణం ఉందని, ప్రజల సౌకర్యార్థం రెస్టారెంట్లు సహా సిటీ సెంటర్ అన్ని తెరచి ఉంటాయని ఆయన వివరించారు. అధికారులు న్యూ ఇయర్ వేడుకల నిర్వహణ పనుల్లో నిమగ్నమై ఉన్న సమయంలో ఉగ్ర దాడులకు ప్లాన్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోనికి తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఉన్న టెర్రర్ అటాక్ లెవల్-3 నుంచి కొత్త సంవత్సర వేడుకల నాటికి లెవల్-4కి చేరుకుంటుందని ఈ నెల 15న ఆ దేశ అంతర్గతవ్యవహారాల మంత్రిత్వశాఖ హెచ్చిరించింది. ఈ క్రమంలో ఉగ్రదాడులకు తావివ్వకూడదని భావించిన మంత్రులు, అధికారులు సెలబ్రెషన్స్ పక్కనపెట్టి భద్రతా, రక్షణ వ్యవహారాలకు ప్రాధాన్యం ఇస్తూ గురువారం తమ నిర్ణయాన్ని ప్రకటించారు.