అబ్బాయిలూ గౌన్లు వేసుకోవచ్చు: కేంబ్రిడ్జ్ వర్సిటీ
లండన్: ఒకటీ రెండూ కాదు.. 800 ఏళ్లుగా కొనసాగుతున్న పక్కాగా అమలవుతోన్న డ్రెస్ కోడ్ నిబంధనను కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ సవరించుకుంది. విద్యార్థులు గౌన్లు ధరించవచ్చని, విద్యార్థినులు ట్రౌజర్స్ వేసుకోవచ్చని సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది.
తొలుత యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న సెంయింట్ క్యాథరీన్స్ కాలేజీలో ఈ నిర్ణయం అమలుకానుంది. ఇప్పటివరకు అబ్బాయిలు సూటులోనే కాలేజీకి రావాలని, అమ్మాయిలు జాకెట్, స్కర్టులో మాత్రమే కనిపించాలనే నిబంధన ఉండేది. డ్రెస్ కోడ్ విషయంలో ఇంతటి సంచలన నిర్ణయం తీసుకోవడానికిగల కారణం కూడా ఆసక్తికరమైందే..
సెయింట్ క్యాథరీన్ కాలేజీలో పీహెచ్డీ చదువుతోన్న చార్లీ నార్త్ట్రోప్ ఇటీవలే లింగ మార్పిడి చేయించుకున్నాడు. మగాడి నుంచి మగువగా మారాడు. అయితే అప్పటివరకూ తనకు అలవాటయిన ట్రౌజర్స్ను ధరించే కాలేజ్కు వెళ్లాలనుకున్నాడు. కానీ అందుకు యూనివర్సిటీ నిబంధనలు అడ్డుతగిలాయి. దీంతో చిన్నపాటి ఉద్యమానికి సిద్ధమయ్యాడు.
800 ఏళ్లనాటికి, ప్రస్తుతానికి లింగపరమైన బేధాల్లో వచ్చిన మార్పులను వర్సిటీ ఉన్నతాధికారులకు వివరించే ప్రయత్నం చేశాడు. బ్రిటన్లో ఎల్జీబీటీ (లెస్బియాన్స్, గే, బై సెక్సువల్, ట్రాన్స్జెండర్) హక్కులను గౌరవించే చట్టాలను కూడా ఓ సారి గుర్తుచేశాడు. ఇంకేముంది.. చార్లీ వాదనకు వర్సిటీ తలొగ్గింది. శతాబ్ధాలుగా అమలవుతోన్న నిబంధనను మార్చివేసింది.