కెమెరా
లండన్: కేవలం మీ ఫోన్‌కున్న కెమెరాతో ఓ గోడకు ఇవతలి వైపు ఉండి అవతల ఎవరున్నారో తెలుసుకోగలిగితే? మీ శరీరాన్ని, మెదడును కేవలం ఓ కెమెరాతో స్కాన్ చేయగలిగితే? పొగమంచులోనూ రోడ్లను స్పష్టంగా చూడగలిగితే? వాటి ఫొటోలు కూడా స్పష్టంగా తీయగలిగితే? ప్రస్తుతానికి ఇవన్నీ అసాధ్యంగానే అనిపిస్తున్నప్పటికీ భవిష్యత్‌లో అందుబాటులోకి రానున్న అత్యాధునిక కెమెరాలతో సాధ్యమేనని పరిశోధకులు చెబుతున్నారు. వీటి సాయంతో సరికొత్త నిఘా ఫోన్ల శకం మొదలవుతుందని అభిప్రాయపడుతున్నారు.
ఈ మేరకు యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గోకు చెందిన ప్రొ.డానియేల్ ఫాసియో, హెరియట్–వాట్ వర్సిటీకి చెందిన ప్రొ.స్టీఫెన్ మెక్లాగ్లీన్ ఓ వ్యాసం రాశారు. భవిష్యత్ కెమెరాల్లో షార్ట్ లేజర్ కిరణాలను ఓ గదిలో ప్రయోగించినప్పుడు గోళాకృతిలో అన్ని కోణాల్లోనూ విస్తరిస్తాయని తెలిపారు. గోడల్ని దాటివెళ్లి వస్తువుల్ని తాకే ఈ కిరణాలు వెనక్కి తిరిగివస్తాయని వెల్లడించారు.
ప్రత్యేకంగా రూపొందించిన అత్యంత సున్నితమైన కెమెరాలు వెనక్కు వచ్చే లేజర్ కిరణాలను గుర్తిస్తాయన్నారు. ఈ కెమెరాలు ఓ సెకనులో 20 బిలియన్ ఫ్రేముల్ని రికార్డు చేయగలవన్నారు. తాము ల్యాబ్ లో చేసిన పరీక్షలో ఓ గోడ అవతలి వైపున ఉండే వస్తువుల్ని ఈ కెమెరాల ద్వారా గుర్తించడం సాధ్యమేనని తేలిందన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు ఘటనాస్థలికి చేరుకోకుండానే లేదా అక్కడికి వెళ్లలేని పరిస్థితుల్లో బాధితుల్ని రక్షించడానికి ఈ సాంకేతికత ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment