అమెరికా చరిత్రలో మరోసారి ‘గవర్నమెంట్ షట్‌డౌన్’ చోటు చేసుకోనుందా? ప్రభుత్వ కార్యాలయాలన్నీ మూతపడనున్నాయా? వినిమయ బిల్లును అమెరికన్ సెనెట్ ఆమోదించకుంటే అదే నిజం కాబోతోంది. అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం అర్థరాత్రితో ‘వినిమయ బిల్లు’ గడువు ముగుస్తోంది. ఆ లోపు కొత్త వినిమయ బిల్లును ప్రతినిధుల సభ, సెనెట్‌తో కూడిన కాంగ్రెస్ ఆమోదించకపోతే ప్రభుత్వ వార్షిక లావాదేవీలు స్తంభించిపోతాయి.
అంటే అత్యవసర ఖర్చులు మినహా మిగతా ప్రభుత్వ కార్యకలాపాలకు నగదు ప్రవాహం నిలిచిపోతుంది. రిపబ్లికన్ల మద్దతు పూర్తిగా ఉన్న ప్రతినిధుల సభ ఇప్పటికే బిల్లును 230–197 తేడాతో ఆమోదించింది. అయితే స్వాప్నికుల(డీమర్ల) భద్రతకు ఎలాంటి ప్రతిపాదనలు లేకపోవడంతో బిల్లును డెమొక్రాట్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కొంతమంది రిపబ్లికన్లు కూడా వారికి మద్దతిస్తున్నారు.
షట్‌డౌన్ అంటే..
ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ ఖర్చులకు సంబంధించి వినిమయ బిల్లులో వేటిని చేర్చాలి.. ఎంత కేటాయింపులు చేయాలన్న దానిపై అమెరికన్ కాంగ్రెస్‌లో విభేదాలు కొనసాగితే ఈ ప్రతిష్టంభన ఏర్పడుతుంది. వినిమయ బిల్లు ఆమోదం పొందకపోతే రోజువారీ వ్యవహారాలకు అవసరమైన నిధులు నిలిచిపోయి షట్‌డౌన్ మొదలవుతుంది.
అవసరమైన నిధుల విడుదలను కాంగ్రెస్ తిరస్కరించడం వల్ల కొన్ని మినహా ప్రభుత్వ కార్యాలయాల్ని పూర్తిగా మూసివేస్తారు. అత్యవసర విభాగాలు(రక్షణ వ్యవహారాలు, డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ, ఎఫ్‌బీఐ వంటివి) మినహా అధిక శాతం ప్రభుత్వ సర్వీసులు నిలిచిపోతాయి. షట్‌డౌన్ సమయంలో 40 శాతం ప్రభుత్వ ఉద్యోగులకు వేతనం లేని సెలవు ప్రకటిస్తారు.
ఎందుకీ షట్‌డౌన్..!
తల్లిదండ్రుల వెంట అమెరికాకు వచ్చిన పిల్లల్ని(స్వాప్నికులు) తిప్పి పంపకుండా.. వారి పరిరక్షణకు తీసుకునే చర్యల్ని బిల్లులో చేర్చాలని డెమొక్రాట్లు పట్టుబడుతున్నారు. ప్రస్తుతం అమెరికాలో వీరి సంఖ్య దాదాపు 7 లక్షల వరకూ ఉంది. అయితే వలస విధానం భిన్న అంశమని, దీనిపై తర్వాత నిర్ణయం తీసుకోవచ్చని అధ్యక్షుడు ట్రంప్, రిపబ్లికన్ సభ్యులు వాదిస్తున్నారు.
ఒబామా హయాంలో స్వాప్నికులకు తాత్కాలికంగా చట్టబద్ధ హోదా కల్పించినా, ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఆ విధానంలో మార్పులు తీసుకొచ్చారు. వీరికి చట్టపరంగా లభిస్తోన్న భద్రతను తొలగించేందుకు గత సెప్టెంబర్‌లో చర్యలు ప్రారంభించారు.
వారానికి రూ. 42 వేల కోట్ల నష్టం
షట్‌డౌన్ వల్ల అమెరికా ప్రభుత్వానికి ఒక్కో వారానికి దాదాపు 6.5 బిలియన్ డాలర్ల(దాదాపు రూ. 42 వేల కోట్లు) నష్టమని ‘ఎస్ అండ్ పీ గ్లోబల్’ విశ్లేషకులు అంచనా వేశారు. 1981 నుంచి ఇంతవరకూ అమెరికాలో 12 సార్లు ‘గవర్నమెంట్ షట్‌డౌన్’ పరిస్థితులు చోటుచేసుకున్నాయి. బిల్ క్లింటన్ హయాంలో అత్యధికంగా 1995 డిసెంబర్ నుంచి 1996 జనవరి వరకూ 21 రోజులు షట్‌డౌన్ కొనసాగింది.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment