
బీజింగ్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు అందించే చికిత్స ఏమాత్రం వేగంగా ఉంటుందో అక్కడికి వెళ్లివచ్చిన వారిని ఎవరిని అడిగినా వెంటనే చెప్పేస్తారు. ప్రభుత్వ ఆస్పత్రుల తీరుపై ఎప్పుడూ ఏదో ఒక విషయం మనం నిత్యం వింటూనే ఉంటాం. అలానే ప్రభుత్వ ఆసుపత్రుల నిర్మాణం కూడా ఏళ్లు గడిచినా పూర్తి కాకుండా నిర్లక్ష్యంగా సాగుతూ ఉంటాయి. అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటుంది. కానీ.. చైనాలో మాత్రం 1000 పడకల గదిని ఏకంగా 10 రోజుల్లోనే నిర్మించాలని నిర్ణయించారు. ఇంత పెద్ద ఆస్పత్రిని కేవలం ఇంత తక్కువ సమయంలో పూర్తి చేయడం అంటే సాహసమనే చెప్పాలి. దీని కోసం ఆ దేశం అందుబాటులో ఉన్న టెక్నాలజీని వాడుకోవడం విశేషం. (చైనాలో కరోనా కల్లోలం)
దేశాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు ఓ వైపున ప్రయత్నిస్తూనే, పెరుగుతున్న రోగులను ఒకే చోట ఉంచి చికిత్సను అందించే దిశగా చైనా కీలక నిర్ణయం తీసుకుంది. శ్రామిక శక్తి అపారంగా ఉన్న చైనా, కేవలం పది రోజుల్లో 1000 పడకల సామర్థ్యమున్న భారీ ఆసుపత్రిని నిర్మించాలని నిర్ణయించింది. ఇప్పటికే వందలాది జేసీబీలు పునాదుల పని ప్రారంభించాయి. ప్రీ ఫ్యాబ్రికేటెడ్ విధానంలో ఈ భవంతి నిర్మాణం సాగనుండగా, పనులు రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ విషయాన్ని అధ్యక్షుడు జీ జిన్ పింగ్ స్వయంగా వెల్లడించారు.
ఇదిలావుండగా.. చైనాలో ప్రజలు కరోనా వైరస్ పేరు వింటేనే తీవ్ర ఆందోళనకు గురవుతున్న పరిస్థితి. అనేక ఆసుపత్రుల్లో బయట టెంట్లు వేసి వ్యాధిగ్రస్తులకు చికిత్సను అందిస్తున్నారు. కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య రోజు రోజుకు అనూహ్యంగా పెరుగుతోంది. ఇప‍్పటివరకూ కరోనా మృతుల సంఖ్య 80కి చేరింది. మరోవైపు సుమారు 3000మంది ఈ వైరస్ బారిన పడినట్లు అధికారులు వెల్లడించారు. వారిలో 300మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు చైనా సర్కార్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment