
భారత్‌ను ఖాతరు చేయకుండా చైనా డ్యామ్
భారత్ అభ్యంతరాలను ఖాతరు చేయకుండా చైనా ప్రభుత్వం పీఓకేలో 1100 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తిచేసే పెద్ద డ్యామ్ నిర్మాణానికి సిద్ధమైంది.
బీజింగ్: భారత్ అభ్యంతరాలను ఖాతరు చేయకుండా చైనా ప్రభుత్వం పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లో 1100 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తిచేసే పెద్ద డ్యామ్ నిర్మాణానికి సిద్ధమైంది. ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్‌ను చైనాలో నిర్మించిన చైనా ప్రభుత్వరంగ సంస్థ ‘త్రీ గోడ్జెస్ కార్పొరేషన్’ పీఓకేలోని కోహల వద్ద జేలం నదిపై ఈ డ్యామ్‌ను నిర్మించేందుకు పాకిస్తాన్‌తో ఒప్పందం కుదిరిందని, సంతకాలు కూడా పూర్తయ్యాయని త్రీ గోడ్జెస్ కార్పొరేషన్ గురువారం తన వెబ్‌సైట్‌లో వెల్లడించింది. భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య పీఓకే వివాదాస్పద ప్రాదేశిక ప్రాంతమైనందును అక్కడ ఎలాంటి డ్యామ్‌లు, కారిడార్‌లు నిర్మించరాదని భారత్ ఆది నుంచి చైనాకు చెబుతో వస్తోంది.
కాశ్మీర్ విషయంలో తాము ఎలాంటి వైఖరిని తీసుకోలేమని, వ్యాపారం నిమిత్తమే పాకిస్తాన్‌లోని ముజాఫర్ నగర్‌కు దిగువున జేలం నదిపై 240 కోట్ల రూపాయలతో డ్యామ్‌ను నిర్మించాలని నిర్ణయం తీసుకున్నామని చైనా ప్రభుత్వం వాదిస్తోంది. 30 ఏళ్ల టారిఫ్‌పై చైనా, పాక్ దేశాల మధ్య డ్యామ్ నిర్మాణానికి అంగీకారం కుదిరిందని పాక్ మీడియా కూడా వెల్లడించింది. చైనా తన ఆధీనంలో ఉందని వాదిస్తున్న వివాదాస్పదమైన దక్షిణ చైనా సముద్రంలో భారత్, వియత్నాం సంయుక్త ప్రాజెక్టులను మరి చైనా ప్రభుత్వం ఎందుకు అనుమతించడం లేదని భారత అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇదేమి ద్వంద్వ ప్రమాణాలన్న ప్రశ్నకు చైనా నుంచి సమాధానం లేదు.
‘న్యూ చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్’లో భాగంగా చైనా ఓ కొత్త డ్యామ్‌ను నిర్మిస్తోంది. భారత్ అభ్యంతరాలు లెక్కచేయకుండా ఇప్పటికే ఈ ఎకనామిక్ కారిడార్ కింద చైనా ప్రభుత్వం ‘కరకోరం’జాతీయ రహదారిని విస్తరిస్తోంది. పీఓకే మీదిగా పాకిస్తాన్‌లో గ్వాదర్ పోర్టు వరకు చైనా ఇప్పటికే రైల్వేలైన్‌ను నిర్మించి, దాని నిర్వహణ బాధ్యతలను కూడా చూస్తోంది.